Mahaa Daily Exclusive

  ఏరోస్పేస్ అడ్డా: హైదరాబాద్‌లో రూ. 1300 కోట్ల సాఫ్రన్ కేంద్రం ప్రారంభం

Share

  • ఏరోస్పేస్ అడ్డా!
  • రూ. 1300 కోట్ల సాఫ్రన్ కేంద్రం ప్రారంభం
  • దేశానికే నెం.1 సర్వీస్ హబ్‌గా తెలంగాణ
  • సాఫ్రన్ రాకతో గ్లోబల్ ఏరోస్పేస్ మ్యాప్‌లో హైదరాబాద్: సీఎం రేవంత్
  • హైదరాబాద్‌ను డిఫెన్స్ కారిడార్‌గా ప్రకటించాలని మోదీకి సీఎం విజ్ఞప్తి

హైదరాబాద్, మహా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఏరోపార్క్‌ (ఎస్ఈజెడ్)లో ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ సంస్థ నెలకొల్పిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (ఎస్ఏఈఎస్ఐ) ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ఈ సెంటర్ ఏర్పాటు తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ రంగాల అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా మారిందని చెబుతూ, బెంగళూరు – హైదరాబాద్‌ను డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ఆయన ప్రధానమంత్రిని కోరారు. సాఫ్రన్ గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసుల సెంటర్ అని తెలిపారు.

సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి..
సాఫ్రన్ దాదాపు రూ. 1,300 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు, భారత వైమానిక దళం, నావికాదళానికి ఉపయోగపడే ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) కేంద్రానికి శంకుస్థాపన చేయడం కూడా ఒక ముఖ్య పరిణామం. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రగతిశీల పారిశ్రామిక విధానాలు, ముఖ్యంగా ఎస్ఎంఈ విధానం దేశంలోనే ఉత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు ఏరోస్పేస్ పార్కుల కారణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని ఆయన వివరించారు.

100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా..
ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ఎగుమతులు గతేడాది రెట్టింపయ్యాయని, గడిచిన 9 నెలల్లో ఫార్మా ఎగుమతులను అధిగమించి రూ. 30 వేల కోట్లకు పైగా చేరుకున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణపై శిక్షణ ఇవ్వడం, టాటా టెక్నాలజీస్‌తో కలిసి 100 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దడం వంటి చర్యలను ప్రస్తావించారు. హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించబోయే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు అందరినీ ఆహ్వానిస్తున్నామని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్‌ మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్‌ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫేన్ క్యూయెల్, జీఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జీఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Latest