- బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ
- ఐటీ కోర్సులో శిక్షణ, ఉద్యోగం పేరుతో ప్రకటనలు
- ఆశావాహుల వద్ద 2 నుంచి 3 లక్షలు వసూలు
హైదరాబాద్, మహా : నిరుద్యోగులను ఐటీ కంపెనీ పేరుతో నిలువునా ముంచారు. ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన మాదాపూర్‌లో ‘ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్’ పేరుతో నకిలీ ఐటీ కంపెనీ ఏర్పాటుచేసి.. నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేసింది. శిక్షణ, ఆపై ఉద్యోగం అంటూ ఆశ చూపి కోట్లాది రూపాయలు దండుకుని రాత్రికి రాత్రి తట్టాబుట్టా సర్దేసింది. ఆ కంపెనీ డైరెక్టర్‌గా వ్యవహరించిన స్వామినాయుడు, అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. గత కొన్ని నెలలుగా మాదాపూర్‌లోని ఓ బిల్డింగ్‌లో ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో స్వామినాయుడు ఆఫీసు ప్రారంభించి.. కార్యకలాపాలు మొదలుపెట్టాడు. ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ’ వంటి డిమాండ్ ఎక్కువగా కోర్సులకు శిక్షణ ఇచ్చి, అనంతరం తమ సంస్థలోనే ఉద్యోగవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఫీజు కింద ఒక్కొక్కరి వద్ద రెండున్నర నుంచి రూ. 3 లక్షల వరకు వసూలు చేసింది. ఇలా.. ఏకంగా 400 మంది విద్యార్థుల నుంచి దాదాపు రూ. 10–12 కోట్ల వరకు వసూలుచేసి బోర్డు తిరిగేసింది.
రోజూ మాదిరిగా బుధవారం ఉదయం తరగతులకు వచ్చిన విద్యార్థులు షాక్ తిన్నారు. కంపెనీ బోర్డు తిప్పేసి, తలుపులకు తాళాలు వేసి ఉండటంతో భిత్తరపోయారు. డైరెక్టర్ సహా మిగతావారి ఫోన్లు స్విచ్చాఫ్ కాగా… వాట్సాప్ గ్రూపులు కూడా డిలీట్ చేశారు. స్వామి నాయుడు, అతడి భార్య, ఇంకొందరు వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ ఆఫీసుకు చేరుకున్న బాధితులు తలుపులు తట్టినా ఎవరూ స్పందించలేదు. ‘అద్దె కూడా చెల్లించలేదు.. ఎవరో వచ్చి లాక్ వేశారు’ అని భవనం యజమాని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు.. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.
మే నెలలోనూ ఇలాంటి ఘటనే
ఈ ఏడాది మే నెలలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గచ్చిబౌలిలో ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సోలుషన్స్ అనే కంపెనీ నిరుద్యోగులను మోసం చేసింది. ఐటీ ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల చొప్పున దాదాపు 200 మంది నుంచి వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దీనికి ముందు మాదాపూర్‌లో ప్రొటెక్ హై పేరుతో ఏర్పాటైన కంపెనీ రూ. 1.5 నుంచి 2 లక్షల వరకు డబ్బులు కట్టించుకుని ఉద్యోగంలో చేర్చుకుంది. వారితో 9 నెలల పాటు పని చేయించుకుని కేవలం 3 నెలల మాత్రమే జీతాలు చెల్లించి, ప్రాజెక్ట్‌లు రావడం లేదని చెప్పి ప్లేటు ఫిరాయించింది. ఐటీ రంగం విస్తరిస్తున్న కొద్దీ మోసాలు కూడా పెరుగుతుండటంతో నిరుద్యోగులలో ఆఁదోళన రేకెత్తిస్తోంది. ఏ సంస్తను నమ్మాలి, ఏ సంస్థనఉ నమ్ముకోవాలి అన్న చర్చ వారిలో జోరందుకుంది.








