- ఇందిరమ్మ చీరలపై విమర్శలా?
- ఆడబిడ్డలపై బీఆర్‌ఎస్‌ది ఓర్వలేనితనం
- మహిళలు సంబరపడుతుంటే మీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు
- బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్
హైదరాబాద్, మహా: ఇందిరమ్మ చీరల పంపిణీపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. “ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేనితనం కేటీఆర్, హరీష్ రావులది” అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు. మహిళా సంఘాలు, ఆడబిడ్డలు స్వయంగా ఎంపిక చేసుకున్న డిజైన్‌లలోనే చీరలను పంపిణీ చేస్తున్నామని, అయినప్పటికీ కలర్ బాగాలేదు, డిజైన్ బాగాలేదు అంటూ బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించడం సరికాదని సీతక్క అన్నారు. చీరలు తీసుకున్న మహిళలు సంతోషంగా సంబరాలు చేసుకుంటుంటే, బీఆర్‌ఎస్ నేతలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసినా బీఆర్‌ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదని, గతంలో ఫ్రీ బస్సు విషయంలోనూ ఇలాగే దుష్ప్రచారం చేశారని ఆమె మండిపడ్డారు.
ఇందిరమ్మ చీరల నాణ్యతపై విమర్శలు చేస్తూ, సిరిసిల్ల నేతన్నలను అవమానించడం తగదని మంత్రి సీతక్క బీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు. “ఇవి బీఆర్‌ఎస్ లాగా సూరత్ నుంచి కిలోల లెక్కన తీసుకొచ్చిన చీరలు కావు, సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసిన చీరలు” అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే, కేటీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడగవచ్చని సవాల్ విసిరారు. కొందరికే ఇస్తున్నారన్న ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. మహిళా సంఘాల సభ్యులకు ఇస్తూనే, సభ్యత్వం లేని వారిని కూడా సంఘంలోకి ఆహ్వానించి సారె పెడుతున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుని, మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం నేర్చుకోవాలని సీతక్క హితవు పలికారు.








