రాత్రికి రాత్రే రాజయోగం..
* రిజర్వేషన్ల రూపంలో పేదోడికి జాక్‌పాట్!
* అక్కడ ఎలక్షన్ లేదు.. సెలక్షనే!
* ఒక్క ఓటు అడగకుండానే గ్రామ సింహాసనం.
* చీపుర్లు అమ్మే స్థాయి నుంచి సర్పంచ్ పీఠం దాకా.. ఇది కదా అసలైన అదృష్టం!
* మహర్దశ అంటే ఇదే.. పైసా ఖర్చు లేకుండానే పల్లె పోరులో పేదలకు పట్టాభిషేకం.
* ఖమ్మం, వికారాబాద్‌లలో వింత.. నామినేషన్ వేస్తే చాలు ఆ సీటు వారిదే!
ఖమ్మం, మహా.
సాధారణంగా ఎన్నికలంటేనే డబ్బు ప్రవాహం, మందు, విందు రాజకీయాలు, ఓటు కోసం గడప గడపకూ తిరిగే నాయకులు కనిపిస్తారు. కానీ, తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో రెండు చోట్ల మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. అక్కడ పైసా ఖర్చు లేదు, ప్రచారం అసలే లేదు.. కనీసం పోటీ చేసే నాథుడే లేడు. నిన్నటి దాకా రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు వెళ్లదీస్తున్న నిరుపేద కుటుంబాలకు అదృష్టం ‘రిజర్వేషన్ల’ రూపంలో వరించింది. ఒక్క ఓటు అడగకుండానే, నామినేషన్ వేస్తే చాలు సర్పంచ్ పీఠం దక్కే అరుదైన జాక్‌పాట్ ఇది. ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్న ఈ అద్భుత ఘట్టం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం రాఘవాపురంలో దాదాపు 471 మంది ఓటర్లు ఉన్నప్పటికీ, అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినది కేవలం ఒక్కటే కుటుంబం. ఆ గ్రామంలో కాంపల్లి కోటమ్మ, ఆమె కుమారుడు రమేశ్ మాత్రమే నివసిస్తున్నారు. సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో కోటమ్మకు పోటీనే లేకుండా పోయింది. ఇక ఆమె కుమారుడు రమేశ్ 4వ వార్డు మెంబర్‌గా ఎన్నిక కానున్నారు. ఆ సామాజిక వర్గంలో పోటీకి మరో వ్యక్తి కూడా లేకపోవడంతో, తల్లి సర్పంచ్‌గా, కొడుకు వార్డు మెంబర్‌గా ఏకగ్రీవం కావడం ఖాయమైంది. దేవుడు వరమిస్తే ఇలాగే ఉంటుందేమోనని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఇదే తరహా అదృష్టం వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబాన్ని వరించింది. ఈసారి సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ కాగా, గ్రామం మొత్తంలో ఆ సామాజిక వర్గానికి చెందినది ఎరుకలి భీమప్ప, వెంకటమ్మ కుటుంబం ఒక్కటే. బుట్టలు అల్లుతూ, ఊరూరా తిరుగుతూ చీపుర్లు అమ్ముకుంటే గానీ వారి ఇల్లు గడవదు. వారి కొడుకులు బతుకుదెరువు కోసం నగరంలో ఆటోలు నడుపుతున్నారు. అలాంటి పేద కుటుంబానికి ఇప్పుడు రాజయోగం పట్టింది. సర్పంచ్ పదవితో పాటు, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు కేటాయించిన రెండు వార్డులు కూడా వీరి కుటుంబానికే దక్కనున్నాయి. రాజకీయ గంధం తెలియని ఆ కుటుంబం, ఇప్పుడు నేరుగా గ్రామ పాలన పగ్గాలు చేపట్టబోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా, మిగతా చోట్ల అభ్యర్థులు గెలుపు కోసం తంటాలు పడుతున్నారు. కానీ ఈ రెండు గ్రామాల్లో మాత్రం ఆ కుటుంబాలు అప్పుడే విజయోత్సవాలకు సిద్ధమయ్యాయి. కేవలం నామినేషన్ పత్రం దాఖలు చేస్తే చాలు.. వారి జీవితం మారిపోతుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరుదైన దృశ్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఏది ఏమైనా, ఈ పంచాయతీ ఎన్నికలు ఆ రెండు నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడం ఖాయంగా కనిపిస్తోంది.








