Mahaa Daily Exclusive

  తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

Share

  • చరిత్ర తిరగరాసే పెట్టుబడుల సదస్సు
  • పీఎం మోదీ సహా కేంద్ర మంత్రులకు ఆహ్వానం
  • గ్లోబల్ సమ్మిట్‌లో వేల కోట్ల పెట్టుబడి ఒప్పందాలే లక్ష్యం
  • మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, వైద్య రంగాలకు ప్రత్యేక స్టాల్స్ డిజైన్లు
  • గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష

హైదరాబాద్, మహా: డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, సలహాదారులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2,600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని అధికారులు సమావేశంలో వివరించారు. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారు.

అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలి..
విభాగాల వారీగా అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని, వారికి సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని సీఎం చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు. సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ డిజైన్లను అధికారులు వివరించగా, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో అవసరమైన జాగ్రత్తలను ముఖ్యమంత్రి సూచించారు. సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించిన అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Latest