మాతృభాషలో ‘మన’ రాజ్యాంగం.
* తెలుగు వారికి చారిత్రక వరం..
* తొమ్మిది భాషల్లో ఆవిష్కరించిన రాష్ట్రపతి.
న్యూఢిల్లీ,మహా.
భారతీయ ఆత్మకు ప్రతీక అయిన రాజ్యాంగం ఇకపై తెలుగు వారి ముంగిట సందడి చేయనుంది. ఇన్నాళ్లు కేవలం ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితమైన చట్టాల చిక్కుముడులు ఇక సామాన్యుడికి కూడా సులభంగా అర్థం కానున్నాయి. భాషా అడ్డంకులు తొలగిపోవడంతో, ప్రతి తెలుగు పౌరుడు దేశ అత్యున్నత చట్టాన్ని క్షుణ్ణంగా చదువుకునే అద్భుత అవకాశం లభించింది. నవంబర్ 26న ‘రాజ్యాంగ దినోత్సవం’ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగాన్ని తెలుగుతో సహా తొమ్మిది భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో ఆవిష్కరించారు. తెలుగుతో పాటు మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, ఒడియా, అస్సామీ, మలయాళం భాషల్లోకి రాజ్యాంగాన్ని అనువదించడం ద్వారా దేశ సమైక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదని, అది మన దేశ ప్రజల ఆశయాలకు నిలువుటద్దమని, ఈ రోజు రాజ్యాంగ నిర్మాతలకు యావత్ దేశం గౌరవం అందించే పవిత్ర దినమని అభివర్ణించారు.
*అతిపెద్ద లిఖిత రాజ్యాంగం.. అపురూప కట్టడం*
ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లోనే భారత రాజ్యాంగానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇందులో 26 భాగాలు, 12 షెడ్యూళ్లు, 448 అధికరణలు ఉన్నాయి. ఆంగ్ల ప్రతిలోనే దాదాపు 1,17,369 పదాలు ఉండటం దీని బృహత్తర స్వరూపానికి నిదర్శనం. రాజ్యాంగం అసలు ప్రతులను యంత్రాలతో కాకుండా, పూర్తిగా చేతితోనే ఇంగ్లీష్, హిందీ భాషల్లో రాయడం విశేషం. కాలగర్భంలో ఈ ప్రతులు పాడవకుండా ఉండేందుకు పార్లమెంటు లైబ్రరీలో హీలియంతో నింపిన ప్రత్యేకమైన కేసుల్లో వీటిని అత్యంత పకడ్బందీగా భద్రపరిచారు.
*ప్రేమ్ బిహారీ నిస్వార్థ సేవ.. ప్రతి పేజీలో సంతకం*
భారత రాజ్యాంగం ఇంత అందంగా, కనువిందుగా ఉండటానికి ప్రధాన కారణం ‘ప్రేమ్ బిహరీ నారాయణ్ రాయ్‍జాదా’. కాలిగ్రఫీలో నిష్ణాతుడైన ఆయన, ఇటాలిక్ శైలిలో అద్భుతమైన చేతిరాతతో రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు. ఈ మహత్తర కార్యానికి ఆయన ఆరు నెలల కఠోర శ్రమను వెచ్చించి, ఏకంగా 254 పాళీలను అరిగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇంతటి బృహత్తర బాధ్యతను నిర్వర్తించినందుకు ఆయన ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ కూడా ఆశించలేదు. తనకు ఎలాంటి పారితోషికం వద్దని, కేవలం రాజ్యాంగంలోని ప్రతి పేజీలో తన పేరు, చివరి పేజీలో తనతో పాటు తన తాతగారి పేరు రాసుకునేందుకు అనుమతినివ్వాలని కోరారు. ఆయన నిస్వార్థ దేశభక్తికి ఇది తార్కాణం.
*గణతంత్ర భారత్ ఆవిర్భావం*
రాజ్యాంగ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26న అది పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26 ఉదయం 10:18 గంటలకు రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ సార్వభౌమ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. రాజ్యాంగం ఆమోదం పొందిన సమయంలో 283 మంది సభ్యులు దానిపై సంతకాలు చేశారు. సరిగ్గా అదే సమయంలో బయట వర్షం కురవడాన్ని సభ్యులంతా దేశానికి శుభసూచకంగా భావించారు.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అదే రోజున డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించగా, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తొలి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1950లో జరిగిన తొలి గణతంత్ర వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా ఎన్నో విశేషాలకు నెలవైన మన రాజ్యాంగం ఇప్పుడు మన తెలుగు భాషలో అందుబాటులోకి రావడం నిజంగా గర్వించదగ్గ విషయం.






