- ఎన్నికలకు కౌంట్‌డౌన్
- నేటి నుంచే నామినేషన్లు
- పోలింగ్, నామినేషన్లపై ఎస్ఈసీ ఫోకస్!
- ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- ఎంసీసీ కఠినంగా అమలు చేయాలి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశం
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషనర్ ఐ. రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, మహా: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికలను మూడు విడతలలో నిర్వహించడానికి షెడ్యూల్ విడుదలైనట్లు తెలిపారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ జరగనున్నట్లు స్పష్టం చేశారు. గ్రామానికి సంబంధించిన రిజర్వేషన్లు, పోలింగ్ విడత, పోలింగ్ కేంద్రాల జియో లొకేషన్ వివరాలను వెంటనే టి-పోల్ వెబ్సైట్/యాప్‌లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు.
నామినేషన్ల షెడ్యూల్, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు..
మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నవంబర్ 27న ఉదయం 10.30 గంటల వరకు విడుదల చేయాలని కమిషనర్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతి రోజు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. నామినేషన్ల పరిశీలన నవంబర్ 30న పూర్తవుతుంది. చెల్లుబాటైన నామినేషన్ల జాబితాపై అప్పీళ్లకు డిసెంబర్ 01 వరకు గడువు ఉంటుంది, వాటిని డిసెంబర్ 2న పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 03 మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పీళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు వంటి ప్రక్రియలు పకడ్బందీగా జరిగేలా జిల్లా ఎన్నికల అధికారులు మార్గదర్శకాలను జారీ చేయాలని సూచించారు. రెండు కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, అలాగే పోలింగ్ కేంద్రాలలో మంచి వెలుతురు, ఫర్నిచర్, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక వసతులు కల్పించాలని తెలిపారు.
ఎంసీసీ అమలు, నిఘా బృందాలు..
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్లకు రాణి కుముదిని సూచించారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ఒక ఏ.ఈ.ఓ. (అసిస్టెంట్ ఎక్స్పెండీచర్ ఆఫీసర్), ప్రతి జిల్లాకు ఒకటి లేదా రెండు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఎంసీసీ అమలును తప్పనిసరిగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లాలో అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ జరగకుండా ప్రింటర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే సమయంలో, రైతులు తమ పంట డబ్బులు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రశీదులు పెట్టుకునేలా వారికి అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు.








