Mahaa Daily Exclusive

  శుక్ర మౌఢ్యమి ఎఫెక్ట్..! కళ్యాణ ఘడియలకు బ్రేక్..

Share

  • శుక్ర మౌఢ్యమి ఎఫెక్ట్..
  •  కళ్యాణ ఘడియలకు బ్రేక్..
  •  80 రోజులు శుభకార్యాలు బంద్!
  •  ముహూర్తాల కోసం పడిగాపులు తప్పవు.
  •  వెలవెలబోనున్న కళ్యాణ మండపాలు.
  •  ఫిబ్రవరి 17 వరకు పెళ్లి బాజాలకు విరామం.
  •  మూఢమి నీడలో మాఘమాసం.

 

ఖమ్మం, మహా.

 

**భారతీయ సంస్కృతిలో వివాహం అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల అనుబంధం. బలమైన ముహూర్తంలో ఒక్కటైన జంట నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందన్నది మన అనాది నమ్మకం. అందుకే పెళ్లి చూపుల నుంచి పీటల మీద కూర్చునే వరకు ప్రతి ఘట్టాన్ని పండితులు నిర్ణయించిన శుభఘడియల్లోనే జరిపించుకుంటాం. అయితే, ముహూర్తమే ప్రధానంగా సాగే ఈ శుభకార్యాల సందడికి తాత్కాలికంగా తెరపడనుంది. కళ్యాణ తోరణాలు, సన్నాయి మేళాలతో కళకళలాడాల్సిన ఇళ్లు ఇక కొద్ది రోజుల పాటు నిశ్శబ్దంగా మారనున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న శుక్ర మౌఢ్యమి (మూఢం) కారణంగా దాదాపు మూడు నెలల పాటు శుభకార్యాలకు విరామం కలగనుంది**

 

కళ్యాణ గడియల కోసం ఎదురుచూస్తున్న వారికి, నూతన గృహప్రవేశాలకు సిద్ధమవుతున్న వారికి నిరాశ తప్పేలా లేదు. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శుక్ర మౌఢ్యమి ప్రభావం వచ్చే ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగనుంది. మాఘ బహుళ అమావాస్య వరకు ఈ మూఢమి ప్రభావం ఉండటంతో, అప్పటి వరకు ఎటువంటి శుభకార్యాలు నిర్వహించడానికి శాస్త్రం అంగీకరించదు. దీంతో సుమారు 80 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగవు. నిత్యం కళ్యాణోత్సవాలతో కిటకిటలాడే ద్వారకాతిరుమల వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఇతర ఆలయాల్లోనూ ఈ సమయంలో నిశ్శబ్దం ఆవరించనుంది. ఇప్పటికే సంబంధాలు కుదుర్చుకుని సిద్ధంగా ఉన్న వధూవరుల కుటుంబాలు, మంచి ముహూర్తాల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా వేచి ఉండక తప్పని పరిస్థితి నెలకొంది.

విశేషమేమిటంటే, సాధారణంగా వివాహాలకు అత్యంత అనుకూలమైన మాసంగా భావించే ‘మాఘమాసం’ ఈసారి పూర్తిగా మూఢంలోనే కలిసిపోయింది. మాఘమాసం ఎప్పుడొస్తుందా అని ఆశగా ఎదురుచూసేవారికి ఇది చేదు వార్తే. ఈ ఏడాది మాఘమాసంలో ఒక్క బలమైన ముహూర్తం కూడా లేకపోవడం గమనార్హం. కేవలం వివాహాలే కాదు, గృహ ఆరంభాలకు, గృహ ప్రవేశాలకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావించే రథసప్తమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి వంటి విశేష తిథులు కూడా ఈసారి మూఢమి ప్రభావంతో నిస్సారంగా మారిపోయాయి. దీంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన ఈ పండుగ రోజుల్లోనూ శుభకార్యాల సందడి కనిపించదు.

మరోవైపు, ఈ 80 రోజుల విరామం ఆయా రంగాలపై ఆధారపడిన వ్యాపారులకు గడ్డుకాలంగా మారనుంది. పెళ్లిళ్ల సీజన్‌పైనే కోటి ఆశలు పెట్టుకున్న ఫంక్షన్‌ హాల్స్‌ యజమానులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, డెకరేషన్‌ నిపుణులు, ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు, పురోహితులు, బాజా భజంత్రీల వారు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అలాగే వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల షాపులు, పూల వ్యాపారులు, ట్రావెల్స్ వంటి అనుబంధ రంగాలన్నీ ఈ మూడు నెలల పాటు వ్యాపారం లేక వెలవెలబోయే పరిస్థితి కనిపిస్తోంది. లక్షల రూపాయల టర్నోవర్ జరిగే ఈ సీజన్‌లో బ్రేక్ పడటం ఆర్థికంగా పెద్ద దెబ్బ అని వ్యాపారులు వాపోతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక గ్రహం సూర్యుడికి అతి సమీపంలోకి వచ్చినప్పుడు లేదా సూర్య కిరణాల ప్రభావంతో కనుమరుగైనప్పుడు దానిని ‘మూఢం’ లేదా ‘మౌఢ్యమి’ అంటారు. ఈ సమయంలో ఆయా గ్రహాల శక్తులు క్షీణిస్తాయి. ముఖ్యంగా దాంపత్య జీవితానికి, సుఖసంతోషాలకు కారకుడైన శుక్రుడు బలహీనపడినప్పుడు చేసే వివాహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవని పండితులు చెబుతున్నారు. శుభకార్యాలకు గురుడు ఎంత ముఖ్యమో, శుక్ర బలం కూడా అంతే కీలకం. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు వివాహాలు జరిపితే దంపతుల మధ్య అన్యోన్యత లోపించడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వంటి ప్రతికూల ఫలిటాలు వస్తాయని శాస్త్రం హెచ్చరిస్తోంది. అందుకే, ఈ 80 రోజులు ఓపిక పట్టి, మూఢమి వీడిన తర్వాతే శుభకార్యాలు జరుపుకోవడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

Latest