- డీకే సీఎం అయితే ఓకే
- ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్ష నాకూ ఉంది
- పార్టీకి డీకే చేసిన కృషి గురించి హైకమాండ్‌కు తెలుసు
- కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక, మహా: కర్ణాటకలో ‘సీఎం మార్పు’పై పోరు ఇంకా కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడు, కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ మార్పునకు అధిష్ఠానం అంగీకరించిన క్రమంలో.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సీఎం అయ్యేందుకు తాను పూర్తిగా మద్దతిస్తానని తెలిపారు. ఓ మీడియాతో మాట్లాడుతూ పరమేశ్వర ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం ఆకాంక్షల గురించి ఎవరైనా అడిగితే.. నేను రేసులో ఉన్నానని చెబుతుంటా. కానీ, అధికార మార్పిడి జరిగి.. డీకేకు సీఎం బాధ్యతలు అప్పగించినా మేము దానికి అంగీకరిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తనకు కూడా ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్ష ఉందన్నారు. పార్టీ కోసం తాను చేసిన కృషి గురించి హైకమాండ్‌కు పూర్తిగా తెలుసని, తుది నిర్ణయం వారిదేనన్నారు.
ఆ క్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక సీఎం పదవికి తగిన వ్యక్తి అన్నారు. అయితే, సిద్ధూ, డీకేల మధ్య ఎలాంటి ఒప్పందం జరిగిందనే విషయం తనకు తెలియదు’ అని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి ఇంకా తెరపడలేదు. సీఎం సీటు కోసం సిద్ధూ, డీకేల మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతుంది. ఈ క్రమంలో సిద్ధూ శిబిరం నుంచి ఇలాంటి ఓ ప్రకటన రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాయకత్వ మార్పుపై ఊహాగానాల వేళ.. డీకే శివకుమార్ పెట్టిన పోస్టు ఆసక్తిరంగా మారింది. మాట నిలబెట్టుకోవడం అనే అర్థం వచ్చేలా ఆయన ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. దానిపై ‘ఒక మాటకు ప్రపంచానికి ఉన్నంత బలం ఉంటుందనే సామెత ఉంది. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే అతిముఖ్యమైన శక్తుల్లో ఒకటి. అది న్యాయమూర్తి, భారత రాష్ట్రపతి, నేను, మీరు, ఎవరైనా.. ఇచ్చిన మాటను గౌరవించాలి’ అని ఉంది.








