- ఐటీకారిడార్ మరో మెగా జీసీసీ
- హైదరాబాద్ కు అంతర్జాతీయ వైమానిక కంపెనీ
- గ్లోబల్ కంపెనీల అడ్డాగా హైదరాబాద్
హైదరాబాద్, మహా : గ్లోబల్ కంపెనీలకు అడ్డాగా ఉన్న హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. నగరంలోని ప్రముఖ ఐటీ కారిడార్‌లో దాదాపు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయి. దీనితోపాటు సుమారు 1,000 ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతోంది. వైమానిక రంగానికి చెందిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి మియామిన్ కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తోంది. భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపినా.. తమ క్లయింట్ పేరును మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్న సంస్థ అని మాత్రమే కమ్యూనికేషన్ జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. కొత్తగా హైదరాబాద్‌లోకి రానున్న ఈ బోయింగ్ లేదా ఎమిరేట్స్ గ్రూప్‌కు చెందినదై ఉండొచ్చన్న ఊహాగానాలు ఐటీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఐటీ రంగంలో హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే నగరంలో 75 కు పైగా అంతర్జాతీయ కంపెనీలు జీసీసీలు స్థాపించగా, కేవలం గత ఏడాదిలోనే 31 ఫార్చ్యూన్ 500 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలను అధిగమిస్తూ, గ్లోబల్ కంపెనీలకు అత్యంత కీలకంగా హైదరాబాద్ నిలుస్తోంది. విజన్-2047 లో భాగంగా ప్రపంచానికి మార్గదర్శకంగా తెలంగాణ ఉండాలని, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్‌లో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.








