- 100 పైగా ఘటన స్థలానికి దుండగులు
- పోలీసుల అదుపులో 3 జెసిబి లు, నిందితులు
మందమర్రి, మహా : మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మి భవాని ఫంక్షన్ హాల్ ప్రహరీ గోడను కూల్చివేతకు యత్నించిన ఘటన మంగళవారం పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే….. మందమర్రి మునిసిపాలిటీ 24వ వార్డు లో గత ఐదు సంవత్సరాల క్రితం గంగాభవాని ఫంక్షన్ హాల్ ను సర్వే నంబర్ 421 లో బైర్నేని లక్ష్మి నిర్మించుకుంది. అయితే ఈ భూమి తమకు చెందిందని ఊరు మందమర్రి కి చెందిన దొర పుస్కూరి పవన్ రావు 3 జెసిబిలు, వందమంది అనుచర బృందంతో గంగా భవాని ఫంక్షన్ హాల్ ను కూల్చి వేసేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా 3 జెసిబి వాహనాలు మూడు స్థలాలలో ప్రహరీ గోడను కూల్చివేతకు యత్నించగా అందులో ఒక కాడ పూర్తిగా ధ్వంసం కాగా మరో రెండు స్థలాలలో పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ లు ఘటన స్థలానికి చేరుకొని ఇరుపక్షాలను స్టేషన్ కు తీసుకువెళ్లి బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు వచ్చిన కొంతమంది దుండగులు శ్రీరాంపూర్ నుండి రాగా, మరికొంతమంది మందమర్రి ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన వారని తెలుస్తోంది. కాగా ఈ ఘటనా స్థలం కేసు హైకోర్టులో విచారణకు ఉండగా గిరిజనులు నిర్మించుకున్న ఫంక్షన్ హాల్ పై ప్రతాపం చూపడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. భారతదేశానికి ఆంగ్లేయుల నుండి స్వతంత్రం సిద్ధించి 78 సంవత్సరాలకు అవుతున్నప్పటికీ గిరిజనులపై భూస్వాముల అణచివేతలు కొనసాగడం గమనార్హం.






