Mahaa Daily Exclusive

  పాత పది రూపాయల నోటే కోడ్ గా భారీగా హవాలా నగదు తరలింపు..!

Share

  • పాత పది రూపాయల నోటే కోడ్ గా
  • భారీగా హవాలా నగదు తరలింపు
  • కాపు కాచి పట్టుకున్న పోలీసులు
  • రూ. 4 కోట్ల నగదు పట్టివేత

 

హైదరాబాద్, మహా : సినిమాలలో సగం చింపిన నోట్ కోడ్ ఆధారంగా నగదు ఉన్న సూట్ కేసును స్మగ్లర్లకు అందించే వారు. సరిగ్గా అదే తరహాలో నగరానికి కోడ్ ఆధారంతో భారీగా నగదును తరలిస్తున్న కారును పోలీసులు ఛేజ్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ కు భారీగా హవాలా డబ్బు రవాణా అవుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో షామీర్ పేట అవుటర్ రింగ్ వద్ద పోలీసులు మాటు వేసి నగదును తరలిస్తున్న కారును పట్టుకునేందుకు సన్నద్దమయ్యారు. ఇంతలోనే మార్గంలో వస్తున్న ఒక కారు పోలీసులను చూసి వేగం పెంచి దూసుకుపోయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అప్పటికే సిద్దంగా ఉన్న తమ కార్లలో దాదాపు 15 కిలోమీటర్లు వెంటాడి పట్టుకుని తనిఖీ చేయగా భారీగా నగదు పట్టుబడింది. కారు టైర్లతో పాటు సీట్ల కింద లగేజీ ప్రాంతంలోనూ నగదును ఉంచిన నిందుతులు నగరానికి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే కారును బోయినపల్లి పోలీసు స్టేషన్ కు తరలించి పట్టుబడ్డ నగదును లెక్కించగా దాదాపు నాలుగు కోట్ల నగదు ఉన్నట్లు తేలింది. మహారాష్ట్ర నుంచి నిందితులు హైదరాబాద్ కు నగదును తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో పట్టుబడ్డ నిందితులిద్దరిని ప్రాథమికంగా ప్రశ్నించగా పాత పది రూపాయల నోటును చూపించిన వారికి నగదును అందించాలన్న ఆదేశాలున్నాయని మాత్రమే చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎక్కడి నుంచి నగదు ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరు తరలిస్తున్నారన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు చెప్పారు. పట్టుబడ్డ నగదుకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇచ్చిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Latest