రూ. 1500 కోట్ల మహా కుంభకోణం..
* సోనూసూద్, ఖలీలకు బిగ్ షాక్!
* బ్లూచిప్ ఉచ్చులో సినీ, క్రీడా దిగ్గజాలు..
* అజారుద్దీన్ మెడకు కూడా ఉచ్చు?
* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘బ్లూచిప్’ స్కామ్!
* ఫుడ్ డెలివరీతో దొరికిన దొంగ..
* రూ. 1500 కోట్ల మోసంలో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు!
* ఆశ చూపించి అడ్డంగా ముంచేశారు..
* బ్లూచిప్ స్కామ్ కేసులో కదిలిన డొంక.. ఆందోళనలో సెలబ్రిటీలు!
హైదరాబాద్, మహా.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రూ. 1500 కోట్ల భారీ ఆర్థిక కుంభకోణం కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్లూచిప్ కంపెనీ పేరుతో జరిగిన ఈ మెగా స్కామ్ తీగ లాగితే సినీ, క్రీడా రంగాలకు చెందిన అతిరథ మహారథుల డొంక కదులుతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడైన రవీంద్ర నాథ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేయగా, కంపెనీ ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో ప్రముఖ నటుడు సోనూసూద్, రెజ్లర్ గ్రేట్ ఖలీలకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. పేదలకు సాయం చేస్తూ రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్ పేరు ఇలాంటి భారీ మోసం కేసులో వినిపించడం ఆయన అభిమానులను, సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ కేంద్రంగా దర్యాప్తు సాగిస్తున్న సిట్ అధికారుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్లూచిప్ కంపెనీని ప్రమోట్ చేశారని, ప్రజలను నమ్మించడంలో కీలక పాత్ర పోషించారని సోనూసూద్, గ్రేట్ ఖలీలపై ఆరోపణలు రావడంతో పోలీసులు వారికి ప్రశ్నల వర్షం కురిపిస్తూ నోటీసులు పంపారు. వారు ఆ కంపెనీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ఒప్పందాలు ఎలా జరిగాయి? అనే కోణంలో స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. నిందితుడు రవీంద్ర సోని నిర్వహించిన ఈవెంట్లలో అజారుద్దీన్ పాల్గొన్న వీడియోలు వైరల్ కావడంతో, త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు అందే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దుబాయ్ కేంద్రంగా నడిచిన ఈ నెట్‌వర్క్ గుట్టురట్టు చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
అసలు ఈ కుంభకోణం ఎలా జరిగిందంటే, ఢిల్లీకి చెందిన రవీంద్ర సోని దుబాయ్ కేంద్రంగా బ్లూచిప్ ట్రేడింగ్ సహా 12 షెల్ కంపెనీలను స్థాపించి మాయాజాలం సృష్టించాడు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఎన్నారైలను, భారతీయ పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకుని వల విసిరాడు. పెట్టుబడిపై నెలకు 3 శాతం, అంటే ఏకంగా ఏడాదికి 36 శాతం గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తామని నమ్మబలికాడు. మొదట్లో కొందరికి డబ్బులు చెల్లించి నమ్మకం కలిగించిన సోని, ఆ తర్వాత దాదాపు 400 నుండి 500 మంది పెట్టుబడిదారుల నుండి సుమారు 1500 కోట్ల రూపాయలను వసూలు చేసి బోర్డు తిప్పేశాడు. ఆ డబ్బును క్రిప్టోకరెన్సీలు, హవాలా మార్గాల ద్వారా విదేశాలకు మళ్లించి 2024లో కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించడంతో బాధితులు లబోదిబోమన్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, ఒక ఫుడ్ డెలివరీ అడ్రస్ ఆధారంగా డెహ్రాడూన్‌లో తలదాచుకున్న సోనిని చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం ఏడు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న సోనిని విచారిస్తుంటే, ఈ స్కామ్ వెనుక ఉన్న సెలబ్రిటీల లింకులు, అంతర్జాతీయ లావాదేవీల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రానున్న రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.






