అరాచకానికి తావివ్వొద్దు..
* ఓటర్ల జాబితా సవరణ ఆగకూడదు!
* బీఎల్ఓలకు రక్షణ కల్పించాల్సిందే..
* లేదంటే కేంద్ర బలగాలను దించుతాం
* రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సీరియస్ వార్నింగ్
* ఎన్నికల సిబ్బందికి బెదిరింపులా? సహించేది లేదు.
* సుప్రీం ధర్మాసనం.
న్యూఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా సాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియను నిర్విఘ్నంగా కొనసాగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బూత్ లెవెల్ అధికారులు , ఇతర ఎన్నికల సిబ్బందిపై జరుగుతున్న దాడులు, బెదిరింపుల పట్ల కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా సవరణలో అవాంతరాలు సృష్టిస్తే, అది అరాచకానికి దారితీస్తుందని హెచ్చరించింది.
ఓటర్ల జాబితా సవరణ నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్య బగ్చీలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ సనాతని సంగ్సాద్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వి. గిరి వాదనలు వినిపిస్తూ, క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు తీవ్ర ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురవుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది భద్రత విషయంలో రాజీపడేది లేదని తేల్చిచెప్పింది. సిబ్బందికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది.
కేంద్ర బలగాలను మోహరిస్తాం..
ఈ కేసు విచారణలో ఎన్నికల సంఘం తరపున హాజరైన న్యాయవాది ద్వివేది కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు. సవరణ ప్రక్రియలో అవాంతరాలు ఎదురైతే, స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పోలీసుల ద్వారా రక్షణ కల్పించడానికి నిరాకరిస్తే, స్థానిక పోలీసులను డిప్యుటేషన్‌పై తీసుకోవాల్సి వస్తుందని, అప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే కేంద్ర బలగాలను రప్పించాల్సి వస్తుందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, బీఎల్ఓలు ఎవరైనా ఒత్తిడికి గురైతే వారి స్థానంలో తక్షణం వేరే వారిని నియమించుకోవాలని, అంతరాయాల గురించి తమ దృష్టికి తెస్తే కఠినమైన ఆదేశాలు జారీ చేస్తామని వెల్లడించింది. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటర్ల జాబితా రూపకల్పనలో ఎలాంటి అలసత్వం, బెదిరింపులను ఉపేక్షించేది లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.






