Mahaa Daily Exclusive

  పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత‌నివ్వండి…కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు…

Share

  • పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత‌నివ్వండి
  • జల్ జీవన్ మిషన్ కింద వెయ్యి కోట్లు ఇవ్వాలని వినతి
  • కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు
  • పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు

న్యూఢిల్లీ, మహా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఉదయం నుంచే పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ముందుగా కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై చర్చించారు. విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంఎస్ కేవై) – ఆర్ఆర్ఆర్ పథకం కింద చెరువులు, కాలువల పునరుద్ధరణకు రాష్ట్రం ప్రతిపాదనలు పంపినట్లు గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిని వివరించి పెండింగ్ లో ఉన్న అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం శ్రీకాకుళం జిల్లాలోని కరువు ప్రాంతాల నీటి అవసరాలకు అత్యవసరమని తెలిపారు. దీనికి అనుమతులు మంజూరు చేయాలన్నారు. వంశధార నది వివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుల అమలు ఇంకా పూర్తిగా జరగడం లేదని గుర్తు చేశారు.

ఆర్థిక మంత్రితో భేటీ

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. కరవు పీడిత ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు, సాగునీటి అవసరాల కోసం గోదావరి వరద జలాల మళ్లింపు కోసం చేపట్టే పోలవరం – నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి నదికి వచ్చే వరద జలాల్లో 200 టీఎంసీల నీటిని పోలవరం ఆనకట్ట నుంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తరలించటమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో కరవు నివారణ సాధ్యపడుతుందని కేంద్రమంత్రికి వివరించారు. మూడు దశలుగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రికి లేఖ అందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. దీనికి సబంధించి ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్టు తెలిపారు. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్‌ను సమర్పిస్తామని వెల్లడించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే ఈ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూత అందించాలని కోరారు.

ఈ ప్రాజెక్టు ద్వారా కరవు పీడిత ప్రాంతాలైన ప్రకాశం, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. 2026-27 కేంద్ర బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, నైపుణ్యకల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల లాంటి కీలకమైన రంగాల్లో పూర్వోదయ నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాలకు నిధులు ఇవ్వాలని కోరారు.రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.

Latest