Mahaa Daily Exclusive

  మహారాష్ట్ర రాజకీయ ధ్రువతార అస్తమయం: విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం!

Share

  • మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ దుర్మరణం
  • ల్యాండింగ్ అవుతుండగా పేలిన విమానం
  • ప్రాణాలు కోల్పోయిన మరో నలుగురు
  • శోక సంద్రంలో అభిమానులు
  • ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ తో పాటు పలువురు సంతాపం

ముంబై, మహా : మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది). ఈ దుర్ఘటనలో పవార్‌ (66)తో పాటు మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8.45 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముంబయి నుంచి బయల్దేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో విమానం అదుపుతప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లు తెలుస్తోంది. విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో ఎవరూ బతికి లేరని వెల్లడించింది. అజిత్‌ పవార్‌తో పాటు ముంబయి పీఎస్‌వో వదీప్‌ జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి మరణించినట్లు తెలిపింది.

అజిత్‌ పవార్‌ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్‌ పవార్‌ సీనియర్‌ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్‌ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్‌ పవార్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌పవార్‌ 1982లో తొలిసారి కార్పొరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్‌ పవార్‌ కోసం ఆ సీటును త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్ణవీస్‌ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. అజిత్‌ పవార్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య సునేత్ర పవార్‌ రాజ్యసభ ఎంపీగా వ్యవహరిస్తున్నారు.

ప్రధాని మోడీతో పాటు పలువురు సంతాపం

మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు, పరిస్థితులపై ఆరా తీశారు. అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. అజిత్‌ పవార్ ప్రజల నాయకుడిగా, గ్రాస్‌రూట్‌ స్థాయి వరకు బలమైన అనుబంధం కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారని మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజల సేవలో అహర్నిశలు శ్రమించిన కష్టజీవిగా ఆయనకు విశేష గౌరవం ఉందని పోస్టులో రాసుకొచ్చారు. పాలనా వ్యవహారాలపై ఆయనకు ఉన్న అవగాహన, పేదలు అణగారిన వర్గాలను శక్తివంతం చేయాలన్న తపన విశేషమని ప్రధాని ట్వీట్ చేశారు. అజిత్‌ పవార్ అకస్మాత్తుగా కన్నుమూయడం షాక్‌కు గురిచేసిందని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన సానుభూతి అని మోదీ తెలియజేశారు.

పవార్ విమాన ప్రమాదంపై దర్యాప్తు

ఏక్‌నాథ్ షిండే కీలక ప్రకటన!

అజిత్ పవార్ విమాన దుర్ఘటనలో మరణించారన్న వార్త తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నా అన్నయ్య పోయాడు. అజిత్ పవార్ మరణంతో మహారాష్ట్ర యావత్ కన్నీళ్లు పెట్టుకుంటోంది. మొత్తం మహారాష్ట్రకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎవరూ కలలో కూడా దీనిని ఊహించలేదు.” ఈ దురదృష్టకర ప్రమాదంపై దర్యాప్తు చేయాలని ఆయన అన్నారు. ఈ విమాన ప్రమాదంలో మా సహచరుడు ప్రాణాలు కోల్పోయారు, ఐదు నుంచి ఆరుగురు మరణించారు, కాబట్టి ఈ విమాన ప్రమాదంపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది, తప్పకుండా దర్యాప్తు చేయాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరోధించడానికి ఇది అవసరం, ఈ ప్రమాదంపై కూడా దర్యాప్తు చేస్తామని ఏక్‌నాథ్ షిండే తెలియజేశారు. మహారాష్ట్రలో ఈరోజు చాలా విచారకరమైన, హృదయ విదారకమైన ఘటన జరిగింది. ఇది ఎవరూ ఊహించని విషయం, అజిత్ దాదా ఇంత త్వరగా మరణించడం మహారాష్ట్రకు చాలా విచారకరమైన, దురదృష్టకరం. గత చాలా సంవత్సరాలుగా అజిత్ దాదా మహారాష్ట్ర రాజకీయాలను నడిపిస్తున్నారు, ఆయన చాలా స్పష్టమైన ప్రసంగం, పరిపాలనపై ఆయన పట్టును చూశాము, ప్రతి విషయాన్ని అధ్యయనం చేసే, ప్రతిదాని గురించి మాట్లాడే అలవాటు ఆయనకు ఉంది, చాలా స్పష్టంగా, నిర్భయంగా ఉన్నప్పటికీ, ఆయన తప్పును తప్పుగా సరైనదాన్ని సరైనదిగా చెప్పేవాళ్లు. ఆయన చాలా స్వచ్ఛమైనవారు, ఆ విషయం నాకు బాగా తెలుసు అని ఏక్‌నాథ్ షిండే అన్నారు.

ఉదయాన్నే పని ప్రారంభించేవారు

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి మంత్రివర్గంలో కూడా పనిచేశాను, ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు, మహారాష్ట్రలో లడ్కీ బహిన్ యోజన లేదా మరేదైనా పథకం ప్రారంభించినప్పుడు, అది ఆర్థిక లేదా ఆర్థిక సదుపాయం అయినా, అజిత్ పవార్ దానిని చాలా చక్కగా పరిపూర్ణంగా నిర్వహించారు. ఆయన పని గురించి నాకు బాగా తెలుసు, ఒకసారి ఆయన ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కచ్చితంగా చేసి చూపించేవారు. అది చేయు, అది చేయు, అది చూడు, అది చూడు వంటి పదాలు ఆయన నిఘంటువులో లేవు, అది మంచిదైతే, ఏం చేయాలో ఆయన చెబుతారు, అది చెడ్డదైతే, ఆయన స్పష్టంగా కాదు అని చెబుతారు. నేను అయినా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయినా , అజిత్ దాదా, మా పనివేళలు కూడా భిన్నంగా ఉండేవి, కానీ మేము తెల్లవారుజాము వరకు పని చేసేవాళ్ళం, అజిత్ దాదా ఉదయం త్వరగా పని ప్రారంభిచేవాళ్లు. అజిత్ దాదా ఉదయం ఆరు గంటలకు కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చేవారు, ప్రజాప్రతినిధులు, అధికారులకు కూడా ఆయన గురించి తెలుసు. అటువంటి నాయకుడిని కోల్పోయానని అన్నారు.

రాజకీయాల్లో అన్నయ్యను కోల్పోయిన అనుభూతి

మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మేము కలిశాము, చాలా మాట్లాడం. ఈ ఉదయం దుర్ఘటన గురించి తెలిసినప్పుడు అవే విషయాలు గుర్తుకు వచ్చాయి. అవే జ్ఞాపకాలు మైండ్‌లో తిరుగుతున్నాయి. ఆయన రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు, ఆయన వయస్సులో నాకంటే పెద్దవాడు, అనుభవంలో నాకంటే పెద్దవాడు. రాష్ట్రంలోని చాలా సమస్యలపై ఆయనకు చాలా అధ్యయనం చేశారు, ఆయన అనేక శాఖలను నిర్వహించారు, ఆయన రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. అజిత్ పవార్ నిష్క్రమణ ఆయన కుటుంబానికి మాత్రమే కాకుండా మొత్తం మహారాష్ట్రకు తీరని నష్టాన్ని కలిగించింది. గత చాలా సంవత్సరాలుగా ఆయనతో ఏర్పడిన సాన్నిహిత్యం, మేము ముగ్గురం రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నప్పటికీ, రాజకీయాల్లో ఒక అన్నయ్యను కోల్పోయిన అనుభూతి కలుగుతోంది. చాలా బాధను అనుభవిస్తున్నాను. ఆయనకు నా హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను అని షిండే అన్నారు.

అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు

మహారాష్ట్రలోని బారామతిలో బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా ఆరుగురు మరణించారు. బారామతిలో విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం జరిగింది. అజిత్ పవార్ చాలా కాలంగా మహారాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బారామతితో ఆయనకు చాలా అనుబంధం కలిగి ఉంది. ఆయన జాతీయ, రాష్ట్ర స్థాయిలో వివిధ పదవుల్లో కొనసాగారు. ప్రజలకు సేవ చేశారు. వాటిలో ఉప ముఖ్యమంత్రిగా, ఎన్ సీపీ సీనియర్ నాయకుడిగా చాలా కాలం పనిచేశారు.

బాబాయ్ శరద్ పవార్ నుంచి రాజకీయ నైపుణ్యాలు నేర్చుకున్న అజిత్ పవార్

అజిత్ పవార్ రాజకీయ ప్రయాణం ఆయన బాబాయ్ శరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది, రాజకీయ నైపుణ్యాలు, సంస్థాగత వ్యూహాన్ని నేర్పించారు బారామతి ప్రాంతాన్ని కుటుంబ రాజకీయ కోటగా మార్చారు. అయితే తర్వాత మారిన రాజకీయ పరిస్థితులు, పార్టీలో చీలిక విభేదాలు చాలా అంశాలు మహారాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

1991 లోక్‌సభ ఎన్నికలు, శరద్ పవార్ రాజీనామా

1991లో బారామతి లోక్‌సభ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా అజిత్ పవార్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ విజయం కేవలం వ్యక్తిగత విజయం కాదు, శరద్ పవార్ రాజకీయ వ్యూహంలో భాగం. తరువాత, అజిత్ పవార్ తన బాబాయ్ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఈ నిర్ణయం ఆ సమయంలో అజిత్ పవార్ పూర్తిగా శరద్ పవార్ నాయకత్వంలో పనిచేస్తున్నారని నిరూపించింది.

అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ స్కూల్

శరద్ పవార్ తో కలిసి పనిచేయడం వల్ల అజిత్ పవార్ అనేక పరిపాలనా పాఠాలు నేర్చుకున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, సమయపాలన పాటించడం, అధికారులు, ప్రజల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం, సంక్షోభ సమయాల్లో కఠినమైన కానీ ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు బాగా వంటపట్టింది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా శరద్ పవార్ అనుభవం అజిత్ పవార్ కు శిక్షణా స్థలంగా పనిచేసింది.

ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు

కాలక్రమేణా, అజిత్ పవార్ తనను తాను శరద్ పవార్ మేనల్లుడి కుమారుడిగా మాత్రమే పరిమితం చేసుకోలేదు. నీటిపారుదల, ఆర్థికం, పరిపాలన వంటి కీలక విభాగాలలో సేవలందిస్తూ, తన పని తీరుతో తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా కాలం పాటు, మహారాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా మారారు. బారామతి ప్రాంతంలో ఆయన రాజకీయ ఆధిపత్యం బలపడింది. అలా బాబాయ్ నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకొని మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ దాదా అని అభిమానులు అప్యాయంగా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. శరద్, అజిత్ మధ్య గురు శిష్యుల సంబంధం ఉంది. కానీ జీవితంలో, రాజకీయాల్లో ఏ సమీకరణం శాశ్వతం కాదు. అందుకే, బహుశా, వారి రాజకీయ కెరీర్ సంధ్యా సమయంలో అజిత్ , శరద్ మధ్య చీలిక స్పష్టంగా కనిపించింది.

అజిత్ బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1991లో జరిగిన ఉప ఎన్నికల్లో అజిత్ తొలిసారి విజయం సాధించారు. తరువాత, 1995, 1999, 2004, 2009, 2014లో వరుసగా ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ విజయం సాధించారు. 1991 నుంచి 1992 వరకు, ముఖ్యమంత్రి సుధాకర్‌రావు నాయక్ ప్రభుత్వంలో వ్యవసాయం, విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత, 1992లో, శరద్ పవార్ ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన భూసార పరిరక్షణ, విద్యుత్, ప్రణాళిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 1999లో, కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు. 2003లో, ఆయన సుశీల్ కుమార్ షిండే మంత్రివర్గంలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్‌సిపి కూటమి విజయం సాధించిన తర్వాత , ఆయన దేశ్‌ముఖ్, తరువాత అశోక్ చవాన్ మంత్రివర్గాలలో జల వనరుల మంత్రిగా పనిచేశారు.

ఇంతలో, తన బాబాయ్ శరద్ పవార్ తో పార్టీలో విభేదాలు తలెత్తాయి. ఆ విభేదాలు మొదట 2019లో వెలుగులోకి వచ్చాయి. ఆ సంవత్సరం నవంబర్ 23న ఆయన ఎన్ సీపీని వీడి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో, ఆ ప్రభుత్వంలో మెజారిటీని నిరూపించుకోవడానికి, తనకు మద్దతు ఇస్తున్న ఎన్ సీపీ ఎమ్మెల్యేల సంతకాలతో గవర్నర్‌కు ఒక పత్రాన్ని కూడా సమర్పించారు. అయితే, 80 గంటలలోపు, మహారాష్ట్రలో రాజకీయాల చక్రాలు తిరిగాయి. అజిత్ మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చారు. 2022లో, శివసేన విడిపోయినప్పుడు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు శివసేన వర్గం, బిజెపి కలిసి ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో, అజిత్ పవార్ మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు. 2023 నాటికి, బాబాయ్, మేనల్లుళ్ల మధ్య దూరం, అధికారం కోసం తహతహలాడే అన్నీ పార్టీలో స్పష్టంగా కనిపించాయి. ఆ సంవత్సరం జూలై 2న, అజిత్ పవార్, తన మద్దతుదారుల ఎమ్మెల్యేలతో కలిసి, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్ సీపీని విడిచిపెట్టి, మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమిలో చేరారు. ఆయన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రాజకీయ మార్పు ఎన్ సీపీలో పెద్ద చీలికకు దారితీసింది.

అజిత్ పవార్.. మహారాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారని తెలిపారు. రాష్ట్రంలో విషాద వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. పవార్ లాంటి మంచి నాయకుడిని కోల్పోవడం తీరని లోటన్నారు. వ్యక్తిగత జీవితంలో అజిత్ పవార్‌ తనకు మంచి స్నేహితుడని, మహారాష్ట్ర అభివృద్ధికి అజిత్ పవార్ కృషి చేస్తున్న తరుణంలో ఆయన అకాల మరణం తీరని లోటని తెలిపారు. పవార్ కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.

అజిత్ పవర్ గొప్ప వ్యక్తి: ఆశిష్ షెలార్

అజిత్ పవార్‌ మృతిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ఆశిష్ షెలార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ పవార్‌ సేవలను కొనియాడారు. అనంతరం మీడియాతో ఆశిష్ షెలార్ మాట్లాడారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అలాంటి వ్యక్తి అకస్మాత్తుగా హఠాన్మరణం చెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అజిత్ పవార్ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అని కీర్తించారు. కరోనా సంమయంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్ ప్రత్యేకమైన ముద్ర వేశారని తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచే ఆయన ప్రజల కోసం అందుబాటులో ఉండే వారని కీర్తించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడిగా అజిత్ పవార్ ఉన్నారని తెలిపారు. అజిత్ పవర్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆ పరమేశ్వరుడు ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉండి ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ఆశిష్ షెలార్ పేర్కొన్నారు.

Latest