హైదరాబాద్, మహా : అంబర్‌పేట ఫ్లై ఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న రూ. 1.85 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టుల కేటాయింపులు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి మీద ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని పేర్కొన్నారు.
12 సంవత్సరాల మోడీ పాలనలో తెలంగాణలో 2,800 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, మరో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారుల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఫలితంగా తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలు కూడా తక్కువ సమయంలోనే జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని, ప్రయాణ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రూ.265 కోట్ల వ్యయంతో అంబర్‌పేట క్రాస్ రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన 4 వరుసల ఫ్లై ఓవర్‌ను నిర్మించిందని గుర్తుచేశారు. ఈ ఫ్లై ఓవర్‌కు అవసరమైన భూసేకరణ పూర్తి కాలేదని గుర్తు చేశారు. భూసేకరణ విషయంలో కొన్ని శక్తులు అడ్డుతగులుతోండటంతో అనవసరంగా తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ ఫ్లై ఓవర్ 2018లో మంజూరయినప్పటికీ లేని సమస్యలు సృష్టించి భూసేకరణ పూర్తి కాకుండా కుట్రలు చేసి సర్వీస్ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగనివ్వకపోవడంతో ఈ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా ఇబ్బందులను అప్పటి సీఎం కేసీఆర్ తో పాటు మీకు కూడా అనేకసార్లు తెలిపినా ప్రయత్నం లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. భూసేకరణకు సంబంధించిన భూమికి రూ. 2.54 కోట్ల పరిహారం లబ్ధిదారులకు ప్రభుత్వం చెల్లించినప్పటికీ మధ్య దళారులు అడ్డుకుంటున్నారన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తిగతంగా చొరవ చూపించి, సర్వీసు రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సంబంధిత జీహెచ్ఎంసీ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా తగిన చర్యలు తీసుకొని సర్వీస్ రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించటానికి సహకరించాలని కిషన్‌రెడ్డి కోరారు.








