- చారిత్రక నిర్ణయం తీసుకున్న కర్నాటక ప్రభుత్వం
- మైనర్లకు నో సోషల్ మీడియా
- 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అసెంబ్లీలో ప్రకటించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు, మహా : కర్ణాటక ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ప్రకటించింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య శుక్రవారం శాసన సభలో 2026-27 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఈ ప్రకటన చేశారు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను అరికట్టడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ..’పిల్లలకు సోషల్ మీడియా ఒక వ్యసనంలా మారుతోంది. దీంతో మానసిక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒంటరిగా ఉండేందుకే ఆసక్తి చూపిస్తున్నారు, తల్లిదండ్రులతో సమయాన్ని గడప లేకపోతున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం అని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక ప్రభుత్వం కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. ఆస్ట్రేలియా, కొన్ని యూరోపియన్ దేశాలు ఇప్పటికే ఇటువంటి నిషేధాలను అమలు చేస్తున్నాయి. అదే తరహాలో పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుండి రక్షించడానికి కర్ణాటక ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
నిర్ణయం వెనుక కారణాలు
సోషల్ మీడియాలో పిల్లలు సైబర్ బుల్లీయింగ్, అనుచిత కంటెంట్, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తప్పుదోవ పట్టకుండా చూడటం తన బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, కళాశాలలను డ్రగ్స్ రహిత మండలాలుగా మార్చడంలో కూడా ఇది సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిషేధాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై ఐటీ, న్యాయ, విద్యా శాఖలు కలిసి పనిచేస్తాయి. వయస్సు నిర్ధారణ కోసం కఠినమైన నిబంధనలను రూపొందించనున్నారు. అలాగే పాఠశాలల్లో “మొబైల్ వీడండి – పుస్తకం పట్టండి” వంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నారు. ఈ నిర్ణయం వల్ల పిల్లల విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








