Mahaa Daily Exclusive

  సివిల్స్ లో మెరిసిన 20 మంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం లబ్ధిదారులు..! విజేతలను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి ..

Share

  • సివిల్స్ లో మెరిసిన 20 మంది రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం లబ్ధిదారులు
  • సింగరేణి ఉద్యోగి కుమార్తె జి .సృజనకు 55 ర్యాంకు
  • విజేతలను అభినందించిన డిప్యూటీ సీఎం భట్టి

 

హైదరాబాద్, మహా: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ లో తెలంగాణ యువత రాణించాలన్న లక్ష్యంతో సింగరేణి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద ఆర్థిక చేయూత అందుకున్న 20 మంది అభ్యర్థులు తుది ఫలితాల్లో విజేతలుగా నిలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ యువత ఆకాంక్షలను సాకారం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందన్నారు. సింగరేణి ఉద్యోగి జి. రాజేశం కుమార్తె జి. సృజన జాతీయ స్థాయిలో 55వ ర్యాంకు సాధించడంపై సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్ విజేతలకు అభినందనలు తెలిపారు.

 

ఈ పథకం కింద ఈ ఏడాది 202 మంది ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులు అయిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చేతుల మీదుగా లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. వీరిలో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారికి మరో లక్ష రూపాయల చొప్పున ఆర్థిక చేయూత అందించగా.. వారిలో ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో 20 మంది విజేతలుగా నిలిచారు. గత ఏడాది ప్రారంభించిన పథకంలో తొలుత 140 మంది ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి సాయం అందించగా.. వారిలో 20 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వారిలో ఏడుగురు విజేతలుగా నిలిచారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సింగరేణి సంస్థ ఆర్థిక సహాయం పొంది సివిల్ సర్వీసెస్ 2025 తుది ఫలితాల్లో విజేతలుగా ఎంపికైన 20 మందిలో 10 మంది ఓబీసీ అభ్యర్థులు, నలుగురు ఎస్టీ అభ్యర్థులు, ముగ్గురు చొప్పున ఎస్సీ, జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఉండటం విశేషం. మొత్తం మీద 16 మంది పురుష అభ్యర్థులు, 4 మంది మహిళా అభ్యర్థులు విజేతలుగా నిలిచారు.

అత్యధికంగా రంగారెడ్డి నుండి ఐదుగురు, మేడ్చల్ మల్కాజగిరి మరియు వరంగల్ అర్బన్ నుండి ముగ్గురు చొప్పున ఎంపిక కాగా ములుగు, నల్గొండ, పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల నుండి ఒక్కొక్కరు ఎంపిక అయ్యారు .

Latest