Mahaa Daily Exclusive

  చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు: సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జనజీవన స్రవంతిలోకి 130 మంది మావోయిస్టులు

Share

  • గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తాం
  • సీఎం రేవంత్ రెడ్డి
  • సీఎం సమక్షంలో లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు
  • 124 ఆయుధాలు అప్పగింత
  • ఇందిరమ్మ ఇంటితో పాటు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తాం
  • ఆయుధాలు వీడకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్, మహా : మావోయిస్టు లొంగుబాటు పరంపరలో భాగంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులు ఈ సందర్భంగా పోలీసులకు 124 ఆయుధాలను అప్పగించారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. 130 మందిలో 125 మంది ఛత్తీస్‌గఢ్, నలుగురు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్​కు చెందినవారున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ రైఫిల్, (31) ఏకే-47 రైఫిళ్లు, (21) ఇన్సాస్ రైఫిళ్లు, (20) ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులతో పాటు 5205 బుల్లెట్లను పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత కొంత కాలంగా రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ జరుగుతోందని, అందులో భాగంగానే మరోసారి భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారన్నారు. మావోయిస్టులు లొంగిపోయేలా కృషి చేసిన డీజీపీ శివధర్ రెడ్డి, ఎస్ఐబీ చీఫ్ సుమతితో పాటు పోలీసుల కృషిని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. పోలీసులు నక్సలైట్లలో ఒక నమ్మకాన్ని కల్పించారని, లొంగిపోయిన వాళ్లు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అహింసా పద్ధతిలోనే బ్రిటీషర్లపై పోరాడి స్వాతంత్య్రం తెచ్చుకున్న చరిత్ర మనదని, హింస, ఆయుధాలతో పోరాటం ఒక్కటే పరిష్కారం కాదని గాంధీ చాటి చెప్పారని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా ఇవాళ చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకుంటున్నాయని, ఇంకా అజ్ఞాతంలో ఉన్న నక్సలైట్లకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలతో మమేకమై కలిసి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కూడా అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలోకి రావాలని కోరిన రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య భద్రతతో పాటు ప్రాణ రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీతో పాటు ఆరోగ్య భద్రత కార్డు కల్పిస్తామన్న రేవంత్ రెడ్డి నిమ్స్‌ వంటి ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు పొందే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని, ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందున భూమి ఇవ్వటంపై హమీ ఇవ్వలేనని, రాష్ట్రంలో హింసకు తావులేదని, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదని పేర్కొన్నారు.

అమిత్ షాతో చర్చించా

కొన్నాళ్ళ క్రితం లొంగిపోయిన దేవ్‌జీ, ఆయన మిత్రబృందం కొన్ని ప్రతిపాదనలు చేశారన్న సీఎం తమ సమస్యలు పరిష్కరిస్తే లొంగిపోతామని చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో మేం చేయగలిగింది చేస్తామని నక్సలైట్‌ నేతలతో చెప్పానని, నక్సలైట్‌ నేతల డిమాండ్లను కేంద్రహోంమంత్రితో చర్చించానని, లొంగిపోయిన వారి మెరుగైన జీవితానికి హామీ ఇవ్వాలని అమిత్ షా సూచించారని అన్నారు. అమిత్ షాతో చర్చల తర్వాత నక్సలైట్‌ నేతలతో మళ్లీ చర్చించానని, కేంద్రహోంమంత్రితో చర్చల సందేశాన్ని నక్సలైట్‌ నేతలకు వివరించానని, తమ చర్చల అనంతరం ఒకేసారి 130 మంది మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ఒకేసారి ఇంతమంది మావోయిస్టులు ఏ రాష్ట్రంలోనూ లొంగిపోలేదని, ఇప్పటివరకు తెలంగాణలో 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని వివరించారు.

నిషేధం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే

రాష్ట్రంలో మావోయిజం లేదంటున్న ప్రభుత్వం మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తుందన్న ప్రశ్నకు స్పందించిన రేవంత్ రెడ్డి మావోయిజమే లేనపుడు నిషేదం ఉన్నా లేకున్నా ఒకటేనని సమాధానం ఇచ్చారు. గాదె ఇన్నయ్య, వరవరరావు లాంటి వారిపై నమోదైన కేసులను ఎత్తి వేస్తారా అని అడుగగా చట్టం పరిధిలో ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా కోర్టులు ఒప్పుకోవని, వారిపై నమోదైన కేసులలో ఉపసంహరించేవి ఉంటే తప్పకుండా ఉపసంహరిస్తామని సీఎం చెప్పారు.

గడిచిన రెండేళ్లలో 700కిపైగా వరకు మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారని డీజీపీ తెలిపారు. ఇటీవలే నలుగురు సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోయారని గుర్తు చేశారు. ఇంకా తెలంగాణ నుంచి ఏడుగురు అజ్ఞాతంలో ఉన్నారని, వీరు కూడా జనజీవనంలోకి రావాలని పిలుపు నిచ్చారు.

Latest