Mahaa Daily Exclusive

  ఏపీ విజయడైరీలో కల్తీ జరుగుతోంది…

Share

  • ఏపీ విజయడైరీలో కల్తీ జరుగుతోంది
  • ప్రైవేట్ ఫ్రాంచైజీలతోనే ప్రమాదం
  • తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన
  • సంచలన ఆరోపణలు చేసిన విజయ డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్, మహా : తెలంగాణ విజయ డైరీ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, ఏపీ విజయ డైరీపైనా సంచలన ఆరోపణలు చేశారు. విజయా బ్రాండ్ పేరుతో కల్తీ పాలు నెయ్యి తెలంగాణలో అమ్ముతున్నారని అమిత్ రెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విజయ బ్రాండ్ ను ఫ్రాంచైజీలు ఇవ్వడం వల్లే ఇలా జరుగుతోందన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయ బ్రాండ్‌ను ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీలుగా ఇవ్వడం వల్ల తీవ్ర అనర్థాలు జరుగుతున్నాయని అమిత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా మేఘన ఫుడ్స్ అనే సంస్థకు ఫ్రాంచైజీ ఇవ్వగా, వారు గుజరాత్‌లో నెయ్యి తయారు చేసి తెలంగాణలో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్లు నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్ డీడీబీ) నివేదిక ఇచ్చిందని ఆయన వెల్లడించారు. నెలకు సుమారు 100 టన్నుల కల్తీ నెయ్యి హైదరాబాద్ మార్కెట్లో అమ్ముడవుతోందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

తెలంగాణ పాడి రైతులకు తీరని అన్యాయం

తెలంగాణ విజయ డైరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు ఇక్కడ తక్కువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని చైర్మన్ ధ్వజమెత్తారు. పాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీల వివరాలు వస్తున్నాయని, దీని వల్ల స్థానిక పాడి రైతులకు రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నెల్లూరు, కర్నూలు యూనియన్లు విజ్ఞప్తి మేరకు విజయ పేరు వాడటం నిలిపివేసినా, కొన్ని ప్రైవేట్ శక్తులు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం స్పందించాలి

డైరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని, ఈ విషయమై ఏపీ డైరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అమిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కల్తీ పాలు, నెయ్యి వ్యవహారంపై ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలోనూ చర్చ జరుగుతోందని, అక్కడి ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పాడి రైతుల ప్రయోజనాల కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, కల్తీ ఉత్పత్తులను అడ్డుకోవడానికి తనిఖీలు ముమ్మరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

Latest