Mahaa Daily Exclusive

  ఐఆర్‌సీటీసీలో నకిలీ ఖాతాల ప్రక్షాళన..! మూడు కోట్ల అకౌంట్లు తొలగింపు.!

Share

  • ఐఆర్‌సీటీసీలో నకిలీ ఖాతాల ప్రక్షాళన.
  •  మూడు కోట్ల అకౌంట్లు తొలగింపు!
  •  సామాన్యుడి ప్రయాణానికే పెద్దపీట.
  •  78 శాతం సీట్లు నాన్‌ ఏసీ విభాగంలోనే.
  •  ఈ ఆర్థిక ఏడాదిలో 75,000 ప్రత్యేక రైళ్లు.
  •  కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్.

న్యూఢిల్లీ:మహా.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఆశ్రయించే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో భారీ ప్రక్షాళన చేపట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు మరియు పారదర్శకతను పెంచేందుకు గానూ ఏకంగా 3 కోట్లకు పైగా నకిలీ ఖాతాలను గుర్తించి, వాటిని శాశ్వతంగా తొలగించినట్లు ఆయన స్పష్టం చేశారు. రైల్వే వ్యవస్థను డిజిటలైజ్ చేయడంతో పాటు, సామాన్య ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికేలా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దళారులు సామాన్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ, సాఫ్ట్‌వేర్లను అడ్డం పెట్టుకుని టికెట్లు బ్లాక్ చేసే విధానానికి ఈ ప్రక్షాళన ద్వారా గట్టి పీట వేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

రైలు ప్రయాణాన్ని మరింత చౌకగా, సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న రైళ్లలో మొత్తం సీట్ల సామర్థ్యంలో దాదాపు 78 శాతం సీట్లు నాన్‌ ఏసీ (జనరల్ , స్లీపర్) కేటగిరీలోనే ఉన్నాయని, ఇది సామాన్య ప్రయాణికుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోందని వెల్లడించారు. కేవలం సంపన్నులకే కాకుండా, అట్టడుగు వర్గాలకు కూడా సరసమైన ధరలకే సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 75,000 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు ఆయన గణాంకాలతో సహా వివరించారు.

దళారీ వ్యవస్థను నిర్మూలించడంపై రైల్వే శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని, అనధికారిక ఏజెంట్లు టికెట్లను విక్రయించకుండా సాంకేతిక పరమైన అడ్డంకులను కల్పించామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పండుగలు, సెలవుల సమయంలో ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను తొలగించేందుకు ముందస్తు ప్రణాళికతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు సరసమైన సర్వీసులను అందించడమే తమ అంతిమ లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయాణికులకు టికెట్ వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు, ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest