- సాదాబైనామా భూములకు ‘రాజ’మార్గం.
- రైతులకు సర్కార్ బంపర్ ఆఫర్!
- ఇక అమ్మకందారుడి అఫిడవిట్ అవసరం లేదు.
- కొనుగోలుదారుడిదే బాధ్యత!
- ఐదు ఎకరాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ.
- జీవోలు 76, 77లతో తిరిగే అదృష్టం!
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని లక్షలాది మంది సాదాబైనామాదారుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. భూములపై సర్వహక్కులు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ‘భూ భారతి’ చట్టం ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆశించినా, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక, చట్టపరమైన అడ్డంకుల వల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం ఇప్పుడు మోక్షం ప్రసాదించింది. రెవెన్యూ శాఖ జారీ చేసిన రెండు ప్రత్యేక జీవోలు 76, 77లు రాష్ట్రవ్యాప్తంగా భూ లావాదేవీల చరిత్రలో ఒక సంచలన మలుపుగా మారనున్నాయి. ఈ నిర్ణయంతో భూమిపై హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న నిరుపేద రైతులకు కొండంత అండ లభించినట్లయింది.
**అమ్మకందారుడి గడప తొక్కాల్సిన పనిలేదు**
గతంలో సాదాబైనామా భూముల క్రమబద్ధీకరణలో అతిపెద్ద అడ్డంకి అమ్మకందారుడి నుంచి అఫిడవిట్ సేకరించడం. భూమిని అమ్మిన వ్యక్తి ఏనాడో చనిపోవడం లేదా వారసులు సహకరించకపోవడం వల్ల లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ చిక్కుముడిని విప్పుతూ జీవో నెం. 76 ద్వారా ప్రభుత్వం విప్లవాత్మక మార్పు తెచ్చింది. ఇకపై భూమి అమ్మిన వ్యక్తి నుంచి ఎటువంటి అఫిడవిట్ అవసరం లేదని, కొనుగోలుదారు సమర్పించే అఫిడవిట్ సరిపోతుందని స్పష్టం చేసింది. కొనుగోలుదారు ఇచ్చే సమాచారం ఆధారంగానే రెవెన్యూ యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతుంది. అయితే ఈ వెసులుబాటును అడ్డం పెట్టుకుని ఎవరైనా తప్పుడు పత్రాలు లేదా సమాచారం సమర్పిస్తే ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అటువంటి వారి రిజిస్ట్రేషన్లను తక్షణం రద్దు చేయడమే కాకుండా, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
**సన్నకారు రైతులకు ఉచిత మోక్షం**
జీవో నంబర్ 77 ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం కనీవినీ ఎరుగని ఊరటనిచ్చింది. ఐదు ఎకరాల వరకు భూమి కలిగి ఉన్న సాదాబైనామాదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి పూర్తి మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా నిరుపేద రైతులకు వేల రూపాయల ఆర్థిక భారం తగ్గనుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించే పూర్తి బాధ్యతను, అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. భూ భారతిలో వివరాలు నమోదు చేయడానికి ముందు 30 రోజుల పాటు అభ్యంతరాల కోసం గడువు ఇవ్వడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేసింది. ఏదైనా వివాదం ఉంటే ఈ గడువులోగా పరిష్కరించుకోవచ్చు.
**పట్టణీకరణ అడ్డంకులు తొలగింపు.. ఇక అంతా వేగమే**
మరో కీలక అంశం ఏమిటంటే, సాదాబైనామా దరఖాస్తు చేసుకున్న సమయంలో గ్రామీణ ప్రాంతంగా ఉండి, కాలక్రమంలో మున్సిపాలిటీలు లేదా నగర పాలక సంస్థల్లో కలిసిపోయిన భూములకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. దీనివల్ల పట్టణ పరిసర ప్రాంతాల్లోని వేల ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం లభించింది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ఇక పరుగులు పెట్టనుంది. భూమిపై స్పష్టమైన యాజమాన్య హక్కులు లభించడం వల్ల రైతులకు బ్యాంకుల నుంచి రుణ సదుపాయం కలగడంతో పాటు, ప్రభుత్వ పథకాలు కూడా సులభంగా అందుతాయి. రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా వచ్చిన ఈ ఉత్తర్వులు రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలను తెచ్చిపెడుతున్నాయి.







