విజయవాడ, మహా.
కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో అత్యంత పాశవిక ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ గాఢనిద్రలో ఉన్న నానమ్మ, మనవడిపై గుర్తుతెలియని దుండగులు సిమెంట్ రాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘోర కలికలంలో పదేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఒక్కసారిగా పెను విషాదం నింపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బాలాజీ (10) తన నానమ్మ లక్ష్మి (70)తో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ అమానుషం జరిగింది. లోపలికి ప్రవేశించిన దుండగులు అత్యంత క్రూరంగా పెద్ద సిమెంట్ రాళ్లతో వారిద్దరి తలలపై మోదారు. తల భాగంలో బలంగా దెబ్బలు తగలడంతో బాలుడు బాలాజీ మంచంపైనే ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్ష్మిని గమనించిన స్థానికులు, వెంటనే ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారని సమాచారం.
ఈ ఘోర ఉదంతంపై సమాచారం అందుకున్న నందివాడ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ సహకారంతో పరిసరాలను పరిశీలించిన పోలీసులు, దాడికి ఉపయోగించిన సిమెంట్ రాళ్లను స్వాధీనం చేసుకున్నారు. పదేళ్ల పసివాడిని అంత దారుణంగా హతమార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే పెదలింగాల గ్రామంలో ఇటువంటి ఘోరం జరగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.







