- నెల రోజుల్లో 15 టన్నుల పదార్థాల సీజ్, 64 మంది అరెస్ట్!
- పసిబిడ్డల ఆహారంలోనూ విషమా? కల్తీ ముఠాల గుట్టు రట్టు చేస్తున్న హైదరాబాద్ పోలీసులు!
- ఆహార భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉక్కుపాదం.. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు!
హైదరాబాద్, మహా.
సమాజంలో పెచ్చుమీరుతున్న ఆహార కల్తీ కేవలం నేరం మాత్రమే కాదని, అది సామాన్యుల ప్రాణాలపై సాగుతున్న ఘోరమైన దాడిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. పసిబిడ్డలు ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌ల నుంచి వంటింట్లో నిత్యం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ పొడి, పాలు, పెరుగు వరకు ప్రతి వస్తువులోనూ విషం నింపుతున్న కల్తీ ముఠాల అకృత్యాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. లాభమే ధ్యేయంగా సామాన్యుల ప్రాణాలను పణంగా పెడుతున్న ఇలాంటి ముఠాల గుట్టు రట్టు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రజారోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ఆహార భద్రత కోసం ప్రత్యేక వ్యవస్థను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృఢ సంకల్పం ఈ దిశగా కీలక మలుపుగా మారింది.
ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ‘హెచ్-ఫాస్ట్’ బృందాలు కల్తీ ముఠాలపై వేటను ఉధృతం చేశాయి. గత నెల రోజులుగా నగరవ్యాప్తంగా సాగుతున్న ఈ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ఈ ప్రత్యేక బృందాలు 61 కేసులు నమోదు చేసి, సుమారు 15 టన్నుల కల్తీ పదార్థాలను సీజ్ చేశాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న 64 మంది నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టాయి. కల్తీ లేని సమాజం కోసం, సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా మా పోరాటం మరింత తీవ్రతరం అవుతుందని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.
లాభాల కోసం అడ్డదారులు తొక్కుతూ ప్రజలను రోగాల పాలు చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి వంటింట్లోనూ భద్రత ఉండాలని, కొనే వస్తువు నాణ్యమైనదిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటున్నారు. ఈ అక్రమ వ్యాపారాల వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు నిఘాను మరింత పెంచారు. కల్తీ ముఠాల ఆటకట్టించేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. సురక్షిత తెలంగాణే లక్ష్యంగా మున్ముందు ఈ దాడులు మరింత ముమ్మరం కానున్నాయి.








