- ఎనిమిదేళ్ల విరామం తర్వాత భారీ ప్రక్షాళన.
- ఒకేసారి 1,912 మంది సిబ్బంది స్థానచలనం.
- పారదర్శకంగా ముగిసిన ప్రక్రియ.
- కమిషనర్ హరికిరణ్ వెల్లడి.
హైదరాబాద్, మహా.
తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ చేపట్టిన భారీ బదిలీల ప్రక్రియ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా శాఖా కమిషనర్ సి. హరికిరణ్ నేతృత్వంలో సాగిన ఈ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,912 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో 326 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఉండగా, అత్యధికంగా 1,586 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న ప్రతి ఒక్కరూ కేవలం మూడు రోజుల్లోగా తమకు కేటాయించిన కొత్త విధుల్లో చేరాలని కమిషనర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. 2018 జూన్ నెలలో జరిగిన సాధారణ బదిలీల తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున సిబ్బంది స్థానచలనం జరగడం ఇదే మొదటిసారి కావడంతో శాఖా వర్గాల్లో ఈ నిర్ణయం పెను సంచలనంగా మారింది.
ఈ బదిలీల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేసిన అధికారులు, 2026 జనవరి 31వ తేదీ నాటికి కనీసం రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే ఈ జాబితాలో చేర్చారు. సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుని, ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ బదిలీల క్రతువును కొనసాగించారు. హెడ్ కానిస్టేబుళ్ల బదిలీల విషయానికి వస్తే జోన్ల వారీగా కేటాయింపులు జరిగాయి. జోన్ 1 కాళేశ్వరం పరిధిలో 27 మంది, జోన్ 2 బాసరలో 50 మంది, జోన్ 3 రాజన్నలో 37 మంది, జోన్ 4 భద్రాద్రిలో 47 మందికి స్థానచలనం కలిగింది. అలాగే జోన్ 5 యాద్రాద్రిలో 27 మంది, అత్యధికంగా జోన్ 6 చార్మినార్ పరిధిలో 108 మంది, జోన్ 7 జోగులాంబలో 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు బదిలీ ఉత్తర్వులు అందుకున్నారు. సంబంధిత డిప్యూటీ కమిషనర్లు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
కానిస్టేబుళ్ల విభాగంలో జిల్లాల వారీగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. కంటిగుయస్ డిస్ట్రిక్ట్స్ (సీడీ) వారీగా చూస్తే పెద్దపల్లి పరిధిలో 124 మంది, నిజామాబాద్లో 201 మంది, కరీంనగర్లో 231 మందికి కొత్త పోస్టింగ్లు ఇచ్చారు. వరంగల్లో 227 మంది, నల్లగొండలో 140 మంది, అత్యధికంగా రాజధాని హైదరాబాద్ పరిధిలో 505 మంది, మహబూబ్నగర్లో 148 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు (డీపీఈఓలు) ఈ బదిలీ ఉత్తర్వులను సిబ్బందికి అందజేశారు. ఈ భారీ స్థాయి మార్పుల వల్ల ఎక్సైజ్ స్టేషన్లలో పరిపాలన మరింత సులభతరం కావడంతో పాటు, అక్రమ కార్యకలాపాల నియంత్రణలో ఆశించిన ఫలితాలు వస్తాయని అబ్కారీ శాఖ బలంగా భావిస్తోంది. ఈ బదిలీల ప్రక్రియను ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా ప్రశాంతంగా, నిబంధనల మేరకు పూర్తి చేసిన డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లను కమిషనర్ సి. హరికిరణ్ ప్రత్యేకంగా అభినందించారు. వ్యవస్థలో నూతన ఉత్తేజం నింపేందుకు ఈ మార్పులు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.








