Mahaa Daily Exclusive

  జేఈఈ పేరిట అక్షరాలా మోసం..! ఆక్స్‌ఫర్డ్ కాలేజీ ‘నకిలీ’ పర్వం..!

Share

  • ఆక్స్‌ఫర్డ్ కాలేజీ ‘నకిలీ’ పర్వం!
  •  ఆధార్ మార్చేశారు.. ఆశల్ని తుంచేశారు.
  •  విద్యార్థుల భవితతో అడ్మిట్ కార్డుల జూదం.
  •   కాలేజీ మేనేజ్‌మెంట్ నిర్వాకంతో నడిరోడ్డుపైకి బాధితులు.

 

గుంటూరు, మహా.

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థే వారి పాలిట యముడిలా మారింది. ఉన్నత చదువుల కోసం కన్న కలలను చిదిమేస్తూ, జేఈఈ మెయిన్స్ పరీక్ష పేరిట గుంటూరులోని ఆక్స్‌ఫర్డ్ జూనియర్ కాలేజీ అడ్డగోలు మోసానికి తెరలేపింది. దరఖాస్తు ప్రక్రియలో దగా చేసి, నకిలీ హాల్ టికెట్లతో విద్యార్థులను పరీక్షా కేంద్రాల వరకు పంపి, అక్కడ వారికి అవమానం, నిరాశ ఎదురయ్యేలా చేసింది.

 

* అసలేం జరిగింది?

 

జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షల కోసం ఆక్స్‌ఫర్డ్ కాలేజీలో చదువుతున్న పలువురు విద్యార్థుల నుంచి యాజమాన్యం దరఖాస్తు ఫీజులు వసూలు చేసింది. తీరా పరీక్ష సమయం దగ్గర పడటంతో హాల్ టికెట్లు చేతిలో పెట్టింది. శుక్రవారం ఉదయం గుంటూరులోని యూనివర్సల్, ప్రియదర్శిని పరీక్షా కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను ఇన్విజిలేటర్లకు చూపించగా అసలు విషయం బయటపడింది. అవి వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసినవి కావని, ఫోటోషాప్‌లో సృష్టించిన నకిలీ పత్రాలని అధికారులు తేల్చిచెప్పడంతో విద్యార్థులు కుప్పకూలిపోయారు.

 

* ఆధార్ మాయాజాలం!

 

ఈ మోసంలో కాలేజీ సిబ్బంది అత్యంత తెలివిగా వ్యవహరించారు. విద్యార్థుల అసలు ఆధార్ నంబర్ల స్థానంలో వేరే వ్యక్తుల నంబర్లను చేర్చి, ఫోటోలు మార్చి హాల్ టికెట్లను ప్రింట్ తీసి ఇచ్చారు. లోపలికి వెళ్లిన విద్యార్థులకు సిస్టమ్ లాగిన్ కాకపోవడం, డేటా సరిపోలకపోవడంతో ఇన్విజిలేటర్లు లోతుగా పరిశీలించి ఇవి ‘ఫేక్’ అని నిర్ధారించారు. దీంతో పరీక్ష రాయకుండానే విద్యార్థులు కన్నీళ్లతో బయటకు వచ్చారు.

 

* మొన్న నీట్.. నేడు జేఈఈ.

 

విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేవలం జేఈఈ మాత్రమే కాదు, రాబోయే నీట్ పరీక్ష కోసం కూడా విద్యార్థుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేసి, వారికి దరఖాస్తులే చేయలేదని తెలుస్తోంది. కాలేజీ డీన్ పీఏ మూర్తి అనే వ్యక్తి ఈ దందాలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు. అటు చూస్తే, అసలు ఈ కాలేజీకి విద్యాశాఖ నుంచి సరైన అనుమతులు కూడా లేవని ప్రాథమిక విచారణలో తేలడం గమనార్హం.

 

* భగ్గుమన్న బాధితులు.

 

తమ పిల్లల ఏడాది కాలం వృథా కావడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. జిల్లా యంత్రాంగం స్పందించి ఆర్డీవో నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ విద్యా వ్యాపార కోరల్లో ఇంకెందరు విద్యార్థులు బలైపోయారో అన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతోంది.

Latest