Mahaa Daily Exclusive

  నింగి నుంచి నేలకు..! గగన్‌యాన్ సేఫ్ ల్యాండింగ్‌కు ‘చినూక్’ భరోసా..

Share

  • గగన్‌యాన్ సేఫ్ ల్యాండింగ్‌కు ‘చినూక్’ భరోసా.
  •  రెండోసారి విజయవంతమైన ఐఏడీటీ పరీక్ష.
  •  అంతరిక్ష యాత్రలో మరో కీలక మైలురాయి.

ఢిల్లీ, మహా.

భారతదేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ దిశగా ఇస్రో అడుగులు మరింత వేగవంతమయ్యాయి. వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చే ప్రక్రియలో అత్యంత కీలకమైన ‘ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్’ ను భారత వాయుసేన సహకారంతో శనివారం విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగం గగన్‌యాన్ మిషన్ అమ్ములపొదిలో మరో అద్భుతమైన మైలురాయిగా నిలిచిపోయింది.

 

*చినూక్ హెలికాప్టర్ విన్యాసం.

 

భారత వాయుసేనకు చెందిన శక్తివంతమైన ‘చినూక్’ హెలికాప్టర్ ఈ ప్రయోగంలో కీలక పాత్ర పోషించింది. క్రూ మాడ్యూల్ (వ్యోమగాములు ఉండే గది) నమూనాను చినూక్ హెలికాప్టర్ ద్వారా సుమారు 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి గాలిలో వదిలిపెట్టారు. భూమి వైపు వేగంగా దూసుకొస్తున్న మాడ్యూల్ వేగాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన పారాచూట్ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. వరుసగా పారాచూట్లు విచ్చుకుంటూ క్రూ మాడ్యూల్ వేగాన్ని నియంత్రిస్తూ, అది సురక్షితంగా భూమిని తాకేలా చేశాయి. వ్యోమగాములు అంతరిక్షం నుంచి తిరిగి వచ్చేటప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యవస్థ ఎంతటి కీలకమో ఈ ప్రయోగం నిరూపించింది.

 

*సమిష్టి కృషితో సాకారం.

 

ఈ ప్రయోగం కేవలం ఇస్రో విజయం మాత్రమే కాదు, భారత రక్షణ రంగ సంస్థల మధ్య ఉన్న అద్భుతమైన సమన్వయానికి నిదర్శనం. భారత వాయుసేన, భారత నౌకాదళం , డీఆర్‌డీఓ ,ఇస్రో శాస్త్రవేత్తలు కలిసికట్టుగా పనిచేసి ఈ క్లిష్టమైన పరీక్షను పూర్తి చేశారు. సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత మాడ్యూల్‌ను వెలికితీయడంలో నౌకాదళం తన వంతు సహకారాన్ని అందించింది. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రను సురక్షితంగా నిర్వహించగలమనే నమ్మకాన్ని ఈ విజయం రెట్టింపు చేసింది.

 

*సురక్షిత ప్రయాణమే లక్ష్యం.

 

గగన్‌యాన్ మిషన్‌లో అత్యంత సవాలుతో కూడిన అంశం ఏదైనా ఉందంటే అది వ్యోమగాములను తిరిగి భూమికి చేర్చడమే. వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే విపరీతమైన వేడిని, వేగాన్ని తట్టుకుని పారాచూట్ల సాయంతో సురక్షితంగా ల్యాండింగ్ అవ్వడంపైనే మిషన్ విజయం ఆధారపడి ఉంటుంది. తాజాగా జరిగిన ఈ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ద్వారా ఆ వ్యవస్థపై శాస్త్రవేత్తలకు పూర్తి భరోసా లభించింది. స్వదేశీ సాంకేతికతతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ అగ్రరాజ్యాల సరసన నిలిచేందుకు ఈ ప్రయోగం దోహదపడనుంది.

Latest