Mahaa Daily Exclusive

  దక్షిణాది గొంతు నొక్కే కుట్ర..! డీలిమిటేషన్ ముప్పుపై సీఎం రేవంత్ ఫైర్..

Share

  • జనాభా కాదు.. ప్రగతిని ప్రామాణికంగా తీసుకోండి.
  • మహిళా రిజర్వేషన్ల ముసుగులో ‘సౌత్’ ఉనికికి ఎసరు.
  • రెండో తరగతి పౌరుల్లా చూస్తే తిరుగుబాటు ఖాయం.
  • డీలిమిటేషన్ ముప్పుపై సీఎం రేవంత్ ఫైర్.

 

ఢిల్లీ, మహా.

 

**దేశ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయగల అత్యంత సున్నితమైన, కీలకమైన ‘నియోజకవర్గాల పునర్విభజన’ (డీలిమిటేషన్) అంశంపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలతో జాతీయ స్థాయి చర్చకు తెరలేపారు. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం ఆయన చేసిన విశ్లేషణ, భవిష్యత్ రాజకీయ ముఖచిత్రంపై విసిరిన అస్త్రాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డీలిమిటేషన్ అనేది కేవలం ఒక పరిపాలనాపరమైన ప్రక్రియ కాదని, అది దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ఉనికికే గొడ్డలిపెట్టుగా మారబోతోందని ఆయన కుండబద్దలు కొట్టారు. జనాభా నియంత్రణ పాటించి, దేశ ఆర్థిక ప్రగతికి వెన్నెముకగా నిలుస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ‘రెండవ తరగతి పౌరులు’గా మార్చే కుట్ర జరుగుతోందని ఎలుగెత్తి చాటారు. కేవలం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు చేపడితే దేశ సమగ్రతకు, సమాఖ్య స్ఫూర్తికి వాటిల్లే ప్రమాదాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు**

 

 

 

భారత ప్రజాస్వామ్య పునాదులైన సమాఖ్య స్ఫూర్తికి, భిన్నత్వంలో ఏకత్వానికి రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అతిపెద్ద సవాలుగా మారనుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం జనాభా పెరుగుదలను మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఎంపీ సీట్లను పెంచాలని చూస్తే, అది దేశ రాజకీయ చరిత్రలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అతిపెద్ద చారిత్రక అన్యాయంగా మిగిలిపోతుందని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ నియంత్రణను విజయవంతంగా అమలు చేసి, జనాభాను అదుపులో ఉంచుకున్న కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఈ పునర్విభజన వల్ల తీవ్రంగా నష్టపోతాయని ఆయన విశ్లేషించారు. ఉదాహరణకు, కేరళలో ప్రస్తుతం ఉన్న 20 సీట్లు కేవలం 30కి మాత్రమే పెరిగే అవకాశం ఉండగా, జనాభా విపరీతంగా పెరిగిన ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఏకంగా 120కి పైగా పెరుగుతాయని, ఇది పెద్ద రాష్ట్రాలను మరింత పెద్దవిగా, చిన్న రాష్ట్రాలను నామమాత్రంగా మార్చేస్తుందని ఆయన వాస్తవాలను కళ్ళకు కట్టారు.

ఈ రాజకీయ అసమతుల్యత భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటును పూర్తిగా ఉత్తరాది గుప్పిట్లోకి నెట్టేస్తుందని ముఖ్యమంత్రి కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ పూర్తయితే ఉత్తరాది రాష్ట్రాల పార్లమెంటు సీట్లు 600 దాటిపోతాయని, అదే సమయంలో దక్షిణాది సీట్లు కేవలం 195 దగ్గరే ఆగిపోతాయని ఆయన గణాంకాలతో సహా వివరించారు. దీనివల్ల భవిష్యత్తులో కేంద్రంలో ఎవరైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కేవలం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల మద్దతు ఉంటే సరిపోతుందని, దక్షిణాది రాష్ట్రాల ప్రమేయం, అవసరం లేకుండానే ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే గనుక జరిగితే, కేంద్ర నిర్ణయాల్లో దక్షిణాది గొంతుక పూర్తిగా నలిగిపోతుందని, ఇది ప్రాంతాల అస్తిత్వానికి సంబంధించిన తీవ్రమైన సమస్య అని ఆయన ఉద్ఘాటించారు. నియోజకవర్గాల పునర్విభజన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీకి సరెండర్ అయిపోయిందని విమర్శిస్తూనే, రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ దేనని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న అతిపెద్ద రాజకీయ డ్రామా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి, నియోజకవర్గాల పునర్విభజనకు ఎలాంటి సంబంధం లేదని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, పైగా 2023లోనే ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. మహిళలకు న్యాయం చేయాలనే నెపంతో, వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాముఖ్యతను తగ్గించడమే కేంద్రం అసలు ప్రణాళిక అని ఆయన తీవ్రస్థాయిలో ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు “ఫైనాన్షియల్ క్యాపిటల్” (ఆర్థిక రాజధాని) లాగా వ్యవహరిస్తుంటే, ఉత్తరాది రాష్ట్రాలు “పొలిటికల్ క్యాపిటల్” (రాజకీయ రాజధాని) గా మారిపెత్తనం చెలాయిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పన్నుల వాటాలో, నిధుల కేటాయింపులో ఇప్పటికే తీవ్ర అన్యాయానికి గురవుతూ గాయపడి ఉన్న దక్షిణాదిపై, ఇప్పుడు రాజకీయంగా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే ప్రజలు ఎంతమాత్రం సహించరని ఆయన హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా దక్షిణాది ప్రజలను సెకండ్ గ్రేడ్ సిటిజన్స్‌గా చూస్తున్నారని, ఈ వైఖరి మారకపోతే అది పెను ప్రజా ఉద్యమానికి, తిరుగుబాటుకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వానికి డీలిమిటేషన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని, డిమాండ్లను ముందుంచారు. కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా, దేశ ఆర్థిక ప్రగతి (జీడీపీ), అభివృద్ధి సూచికలు, కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించిన తీరును పరిగణనలోకి తీసుకొని మాత్రమే ఎంపీ సీట్ల పెంపు ఉండాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు దేశవ్యాప్తంగా శాస్త్రీయంగా జనగణన, కులగణన పూర్తి చేయాలని, 2027 మార్చి నాటికి ఈ ప్రక్రియ ముగిశాకే డీలిమిటేషన్‌పై అడుగు ముందుకు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రభుత్వం కేవలం ఐదు నెలల్లోనే జనగణన, కులగణన పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకుందని, కేంద్రం కూడా అదే బాటలో పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. గతంలో వివాదాస్పద రైతు చట్టాలను బలవంతంగా రుద్దాలని చూసిన కేంద్రం, రైతుల పోరాటం దెబ్బకు ఎలా వెనక్కి తగ్గిందో.. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలోనూ మొండిగా ముందుకు వెళ్తే ‘ఇండియా’ కూటమి పక్షాలతో కలిసి అదే తరహాలో ఉమ్మడి పోరాటం చేస్తామని, కేంద్రం తలొగ్గక తప్పదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.

Latest