Mahaa Daily Exclusive

  విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర…

Share

  • విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
  • భగ్నం చేసిన ఇంటెలిజెన్స్
  • కుట్ర వెనుక డీఎంకే నేతలు

 

చెన్నై, మహా : తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర జరిగింది. దీనిని తాము భగ్నం చేసినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. రెండు నెలల్లోనే ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం ఒకేసారి 15 మంది టీవీకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం ఈ కుట్ర ముఖ్య ఉద్దేశం అని తెలుస్తోంది. ఓ టీవీకే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు ప్రారంభించి, ఒక కన్సల్టెన్సీ సంస్థ ఉద్యోగిని తిరుచ్చిలో, మరో ఇద్దరిని చెన్నైలో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరికి డీఎంకే ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ, అతడి సోదరుడితో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కుట్ర, దీని వెనుక ఉన్న విస్తృత నెట్‌వర్క్‌పై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, టీవీకే నేత జేసీడీ ప్రభాకర్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం కోసం ఐపీడీఎస్ అనే కన్సల్టెన్సీకి చెందిన ఓ వ్యక్తి తనకు రూ. 35 కోట్ల ఆఫర్ చేశాడని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత తనను భయపెట్టి, ఈ ఆఫర్ గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని హెచ్చరించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో ఇంటిలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి గుట్టును రట్టు చేశాయి. ఈ కుట్రపై తమిళనాడు మంత్రి సీటీ నిర్మల్ కుమార్ డీఎంకేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెంథిల్ బాలాజీతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు, అలాగే కరూర్ గ్యాంగ్‌ వ్యక్తులు ఈ వ్యవహారంలో నేరుగా పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఎంకే స్టాలిన్, ఉదయనిధి ఆదేశాల మేరకు సెంథిల్ బాలాజీ వంటి కీలక డీఎంకే నేతలు తమ ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని తెలిపారు. వాళ్లు రూ. 10-50 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారని, వారు సంప్రదించని ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరని ఆయన పేర్కొన్నారు. అలాగే తమ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి డీఎంకే, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కే పళనిస్వామి పరస్పరం చేతులు కలిపారని కూడా మంత్రి ఆరోపించారు.