Mahaa Daily Exclusive

  వీబీ-జీ రామ్ జీ పథకంతో పేదల ఇంట వెలుగులు..!

Share

  •  ఏడాదికి 185 రోజుల పాటు ఉపాధి కల్పన.. పక్కాగా డిజిటల్ విధానం.
  • గోదావరి పుష్కరాల నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి.
  •  ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్.. పుట్టపర్తికి ఫైటర్ జెట్ పరిశ్రమ.
  •  ‘గొడ్డలి’ పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు.
  •  ముక్కువారిపల్లిలో పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

 

తిరుపతి, మహా .

వికసిత్ భారత్ రోజ్‌గార్ (వీబీ-జీ రామ్ జీ) పథకంతో రాష్ట్రంలోని పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఈ బృహత్తర పథకం గ్రామాల ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేస్తుందని, తద్వారా పేదల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ముక్కువారిపల్లిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఈ నూతన పథకానికి అట్టహాసంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని స్పష్టం చేశారు.

ఈ పథకం కింద నిరుపేదలకు ఏడాదిలో ఏకంగా 185 రోజుల పాటు పని కల్పిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. పనుల కల్పనలో గానీ, నిధుల మంజూరులో గానీ దొంగ లెక్కలు రాసుకునే అవకాశం లేకుండా పక్కాగా డిజిటల్ విధానాన్ని ఈ పథకంలో అమల్లోకి తెచ్చినట్లు వివరించారు. అంతేకాకుండా, వీబీ-జీ రామ్ జీ పథకంలో రాష్ట్రాల వాటాను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచినట్లు గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం సరికొత్త ఆలోచనలు, విధానాలతో ముందుకు వెళ్తోందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం అగ్రదేశంగా అవతరించబోతోందని ఆయన కితాబునిచ్చారు. అలాగే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారిపోతున్నాయని చంద్రబాబు ప్రశంసించారు.

రాష్ట్రవ్యాప్తంగా రాబోయే భారీ పరిశ్రమలు, పెట్టుబడుల గురించి ముఖ్యమంత్రి సవివరంగా మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఐటీ రంగాన్ని పరుగులు పెట్టిస్తూ త్వరలోనే గూగుల్ డేటా సెంటర్‌ రాబోతోందని, అలాగే పుట్టపర్తిలో ఫైటర్ జెట్ పరిశ్రమను నెలకొల్పుతామని ప్రకటించారు. రాయలసీమను అన్ని విధాలా అభివృద్ధి చేసి నిజమైన రతనాల సీమగా మారుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఇందులో భాగంగా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును రాబోయే గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఆయన గట్టిగా స్పష్టం చేశారు.

ఇదే వేదికగా ప్రతిపక్ష వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న ఆ ‘గొడ్డలి పార్టీ’ రోజూకో కొత్త డ్రామా ఆడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి అంగీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తీరా అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ ‘మావిగన్’ అంటూ కొత్త రాగం అందుకున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏది ఏమైనా రాజధానిగా అమరావతి నిర్మాణాన్ని ఆపడం ఎవరి తరం కాదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వైసీపీ నేతల సంగతిని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామే స్వయంగా చూసుకుంటారని చంద్రబాబు హెచ్చరించారు.