Mahaa Daily Exclusive

  క్వారీలో ఘోర ప్రమాదం..! బండరాయి పడి ఏడుగురు కార్మికులు దుర్మరణం..!

Share

  •  బండరాయి పడి ఏడుగురు కార్మికులు దుర్మరణం!
  •  బెంగళూరు సమీపంలో విషాదం.
  •  మృతులంతా బిహార్ వలస కూలీలు.
  • ఘటనపై కేసు నమోదు.
  •  తీవ్ర విచారం వ్యక్తం చేసిన కర్ణాటక సీఎం శివకుమార్.

బెంగళూరు,మహా.

కర్ణాటక రాష్ట్రంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. క్వారీలో పనులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా భారీ బండరాయి జారిపడటంతో ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరు దక్షిణ తాలూకా పరిధిలోని మడ పట్టణంలో ఉన్న ‘కావేరి స్టోన్ క్రషర్’ కంపెనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. మరణించిన వారంతా బిహార్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో సదరు క్వారీలో సుమారు 15 నుంచి 20 మంది వరకు కార్మికులు పనులు చేసుకుంటున్నారు. అక్కడ కొత్త క్రషర్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా దాదాపు 100 అడుగుల ఎత్తులో ఒక హిటాచీ యంత్రంతో పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పైనుంచి ఒక భారీ బండరాయి అకస్మాత్తుగా జారి కింద పనిచేస్తున్న కార్మికులపై పడింది. దీంతో ఏడుగురు కార్మికులు బండరాయి కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, రక్షణ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలను తొలగించి వాటి కింద చిక్కుకుపోయిన మిగతా కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అలాగే, గాయపడిన క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్వారీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారా? లేక భద్రతా నిబంధనలను ఉల్లంఘించారా? అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

క్వారీ యజమానులపై చర్యలు: సీఎం శివకుమార్ హెచ్చరిక

ఈ దారుణ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ పెద్ద దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా క్వారీల్లో పనిచేసే కార్మికుల భద్రత, రక్షణ బాధ్యత పూర్తిగా యజమానులదేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లాభాల కోసం భద్రతా నిబంధనలను తుంగలో తొక్కి, కార్మికుల ప్రాణాలతో ఆడుకునే క్వారీలపై ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటుందని సీఎం శివకుమార్ గట్టిగా హెచ్చరించారు.