Mahaa Daily Exclusive

  నకిలీ వీసాలతో మస్కట్‌కు చెక్కేసేందుకు యత్నం..! శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అరెస్ట్..!

Share

  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అరెస్ట్!
  •  ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కబోతుండగా పట్టుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు.
  •  ముమ్మరంగా విచారిస్తున్న ఎయిర్‌పోర్ట్ పోలీసులు.

శంషాబాద్,మహా.

నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన 20 మంది మహిళా ప్రయాణికుల ముఠా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడ్డంగా దొరికిపోయింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లో ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం నిర్వహించిన పక్కా తనిఖీల్లో ఈ నకిలీ వీసాల భాగోతం వెలుగుచూసింది. మస్కట్‌కు పారిపోయేందుకు యత్నించిన సదరు 20 మంది మహిళలను అధికారులు అరెస్ట్ చేశారు.

పోలీసులు, ఇమ్మిగ్రేషన్ వర్గాల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 20 మంది మహిళా ప్రయాణికులు మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వీరంతా ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించేందుకు అవసరమైన బోర్డింగ్ ప్రక్రియను ముగించుకుని, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్దకు వచ్చారు. అక్కడ ప్రయాణికుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించే క్రమంలో అధికారులకు సదరు మహిళల వీసాలపై తీవ్ర అనుమానం వచ్చింది. సాంకేతిక ఆధారాలతో వాటిని నిశితంగా తనిఖీ చేయగా.. ఆ 20 మంది వద్ద ఉన్న వీసాలన్నీ నకిలీవని (ఫేక్ వీసాలు) తేలడంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.

దీంతో ఆ మహిళా ప్రయాణికులను విమానం ఎక్కనివ్వకుండా అక్కడే అడ్డుకున్న అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నిందితులందరినీ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న ఔట్‌పోస్ట్ పోలీసులు మహిళలను ముమ్మరంగా విచారిస్తున్నారు. అసలు వీరంతా ఏ ప్రాంతానికి చెందిన వారు? వీరికి ఈ నకిలీ వీసాలను ఎవరు సమకూర్చారు? దీని వెనుక ఉన్న అంతరాష్ట్ర ముఠా లేదా ఏజెంట్ల పాత్ర ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయక మహిళలను మోసం చేసి పంపుతున్న ఏజెంట్ల గుట్టురట్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నకిలీ వీసాల కలకలానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల సమగ్ర విచారణలో తెలియాల్సి ఉంది.