- కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చేతుల మీదుగా ఆవిష్కరణ.
- రైల్వేకోడూరు ముక్కువారిపల్లిలో తొలి పనులకు శ్రీకారం.. లబ్ధిదారులకు జాబ్ కార్డుల పంపిణీ.
రైల్వేకోడూరు,మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ) జాతీయ పథకం ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సంయుక్తంగా ఈ బృహత్తర పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
ఈ జాతీయ పథకం ప్రారంభోత్సవంలో భాగంగా రైల్వేకోడూరు పరిధిలోని ముక్కువారిపల్లి గ్రామంలో రూ.4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన మూడు ప్రారంభ పనులకు నేతలు ఘనంగా శ్రీకారం చుట్టారు. దేశంలోనే ఈ మిషన్ కింద తొలి పనులుగా సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట నిర్మాణం, మ్యాజిక్ డ్రెయిన్ ఏర్పాటు, మొక్కల పెంపకం కార్యక్రమాలను వారు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి స్వయంగా నూతన జాబ్ కార్డులను అందజేశారు.
ఈ చారిత్రక వేదికపై కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్ కలిసి ‘వీబీ జీ రామ్ జీ’ పథకానికి సంబంధించిన ప్రత్యేక ప్రోత్సాహక గీతాన్ని (ప్రమోషనల్ సాంగ్) ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ పథకం యొక్క సమగ్ర సమాచార బుక్‌లెట్‌ను, ఇతర అధికారిక ప్రచురణలను విడుదల చేయగా, వేదికపై ఉన్న ప్రముఖ నేతలంతా కలిసి పథకానికి సంబంధించిన అధికారిక వెబ్ పోర్టల్‌ను డిజిటల్ పద్ధతిలో ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి రంగాన్ని, పేదల జీవన ప్రమాణాలను మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం ఏపీ గడ్డపై నుంచే దేశవ్యాప్త ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.






