• ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొత్త పోలీస్ సరిహద్దులు.
• భవిష్యత్ నగర విస్తరణకు అనుగుణంగా పోలీసింగ్.
• పోలీస్ స్టేషన్ పరిధుల పునర్విభజనపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష.
హైదరాబాద్, మహా.
తెలంగాణలో పోలీసు పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పోలీసు శాఖ కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్ పరిధులను ఖరారు చేయాలని స్పష్టం చేశారు.
పునర్వ్యవస్థీకరణపై సమీక్ష సమావేశం
రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ అంశాలను డీజీపీ సీవీ ఆనంద్ సమీక్షించారు. గత ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కొన్ని అంశాలు ఇంకా అమలులోకి రాకపోవడంతో ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులపై అధికారులతో విస్తృతంగా చర్చించారు.
పరిధుల ఖరారుపై స్పష్టమైన మార్గదర్శకాలు
సమావేశంలో ఆయా కమిషనర్లు పోలీస్ స్టేషన్ల పునర్విభజన, భౌగోళిక పరిధులు, పరిపాలనా అవసరాలు, స్థానిక పరిస్థితులకు సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వులను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ సరిహద్దులను నిర్ణయించాలని డీజీపీ ఆదేశించారు.
భవిష్యత్ అవసరాలకనుగుణంగా ప్రణాళిక
రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీవీ ఆనంద్ సూచించారు. భవిష్యత్తులో కొత్త కాలనీలు, మున్సిపల్ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను ముందుగానే అంచనా వేసి పోలీసింగ్ వ్యవస్థను రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొత్త సరిహద్దులు
పోలీస్ స్టేషన్ల పరిధుల మార్పులతో ప్రజలు, ప్రభుత్వ శాఖలు, న్యాయవ్యవస్థకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. వివాదాస్పద ప్రాంతాలు, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై అధికారులతో చర్చించి వాటికి తుది పరిష్కారం చూపుతూ కొత్త ప్రతిపాదనల్లో వాటిని పొందుపరిచారు.
ప్రజాకేంద్రిత పోలీసింగ్‌కే ప్రాధాన్యం
పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ప్రధాన ఉద్దేశం ప్రజలకు మరింత చేరువైన, వేగవంతమైన, సమర్థవంతమైన పోలీసు సేవలను అందించడమేనని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ప్రజాకేంద్రిత పోలీసింగ్‌ను బలోపేతం చేస్తూ చట్టవ్యవస్థ నిర్వహణ, నేర నియంత్రణ, అత్యవసర సేవల అందింపులో మెరుగైన ఫలితాలు సాధించేలా కొత్త వ్యవస్థ ఉండాలని సూచించారు.
ఉన్నతాధికారుల హాజరు
ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్ రెడ్డి, మల్కాజిగిరి పోలీసు కమిషనర్ సుమతి, సంయుక్త కమిషనర్లు, ఇతర ఉన్నత పోలీసు అధికారులు పాల్గొని తమ తమ కమిషనరేట్లకు సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు







