- మద్దతు ధర.. ఒట్టిమాటే
- ఆధిపత్యం కోసం ముగ్గురు మంత్రుల బిజీ
- రైతులకు మద్దతుధర చెల్లించాలి
- ఖమ్మం పత్తి మార్కెట్ లో మాజీమంత్రి హరీష్ రావు
- పువ్వాడ అజయ్, గంగుల, వద్దిరాజు రవిచంద్ర, తాతా మధుతో కలిసి పర్యటన
ఖమ్మం: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీశ్ రావు అన్నారు. బోనస్ మాట బోగస్ అయింది.. మద్దతు ధర కూడా రావట్లేదని విమర్శించారు. ప్రభుత్వ అలసత్వంతో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఖమ్మం పత్తి మార్కెట్‌ను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో పత్తి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ రైతులను నట్టేట ముంచిందన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని విమర్శించారు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామన్నారని, ఇప్పడు బోనస్‌ను బోగస్‌గా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు.సీసీఐ రైతుల దగ్గర పత్తి కొనడం లేదని, దళారుల వద్ద కొంటున్నదని చెప్పారు. రాష్ట్రంలో పత్తి రైతులకు మద్దతు ధర రావట్లేదని చెప్పారు. ఖమ్మం మార్కెట్‌లో ఇప్పటి వరకు మద్దతు ధర రాలేదని చెప్పారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఆధిపత్యం కోసం బాగా బిజీ అయ్యారని, రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం, కుట్రలు చేయడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రాకేష్ రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, ఆర్జెసి క్రిష్ణ, చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.
……