Mahaa Daily Exclusive

  జమిలి బిల్లుపై కాంగ్రెస్ నిర్ణయం ఇదే.. సభలో రణరంగమే..!

Share

వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కసరత్తు ముమ్మరమైంది. నేడు మరో ముందడుగు పడబోతోంది. ఈ బిల్లును అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లోక్‌సభ సమక్షానికి తీసుకుని రాబోతోంది. ఈ మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని సభలో ప్రవేశపెట్టనుంది.

 

అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలతో పాటు స్థానిక సంస్థలకూ ఒకేసారి మధ్యంతర ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన బిల్లు ఇది. ఈ ముసాయిదా బిల్లుకు ఇదివరకే కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఇటీవలే ఆమోదం తెలిపింది.

 

ఇదే ముసాయిదా బిల్లు ఇంకాస్సేపట్లో సభ సమక్షానికి రాబోతోంది. ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరం జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా అధికార, ప్రతిపక్ష సభ్యులతో కూడిన ఓ జేపీసీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

 

జమిలి ఎన్నికల బిల్లులో ఏవైనా సవరణలు ఉంటే ఈ కమిటీ ఇచ్చే సూచనలు, సలహాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ అమలులోకి వస్తే 2027 ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ బిల్లుపై తన నిర్ణయాన్ని వెల్లడించింది కాంగ్రెస్ పార్టీ. దీన్ని వ్యతిరేకిస్తోన్నామని ప్రకటించింది. మొదటి నుంచీ తమ నిర్ణయం ఇదేనని, ఇందులో ఎలాంటి మార్పూ ఉండబోదని తెలిపింది. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒకేసారి అన్ని రాష్ట్రాలు, లోక్‌సభ స్థానాలను ఎన్నికలను నిర్వహించడం అనేది సాధ్యం కాదని తెలిపింది.

 

ఈ బిల్లు వల్ల ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతింటుందని లోక్‌సభ విప్ కొడికొన్నిల్ సురేష్, ఎంపీలు మనీష్ తివారీ, జైరామ్ రమేష్ అన్నారు. భారత్ ఓ సమాఖ్య దేశమని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలకు తమకంటూ సొంత వ్యూహాలు, ఆలోచనలు, అభిప్రాయాలు, పథకాలు ఉంటాయని కే సురేష్ అన్నారు. మిగిలిన అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీనికే కట్టుబడి ఉంటాయని చెప్పారు.

 

మనీష్ తివారీ సైతం ఇదే విషయాన్ని చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ రూల్ 72 కింద సెక్రెటరీ జనరల్‌కు నోటీసులు ఇచ్చారు. రాజ్యాంగబద్ధత, సమాఖ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, తమ అభ్యంతరాలను సభలో చర్చ సందర్భంగా వివరిస్తామని చెప్పారు.

 

కాంగ్రెస్ ఎంపీ జైరామ్ రమేష్ మాట్లాడారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. దీనిపై తమ అభ్యంతరాలను వివరిస్తూ ఈ ఏడాది జనవరి 17వ తేదీన కమిటీ ఛైర్మన్ రామ్‌నాథ్ కోవింద్‌కు తమ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సైతం లేఖ రాశారని గుర్తు చేశారు. ఈ బిల్లు వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అభిప్రాయం ఏమిటో తమకు ముందే తెలుసునని జైరామ్ రమేష్ వ్యాఖ్యానించారు.