- మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన నిజమైన అస్తిత్వం
- జాతి సంస్కృతి, దేశ వైభవాలను సాహిత్యం ప్రతిబింబిస్తుంది
- నూతన సాహిత్య సృష్టితో పాటు, ప్రాచీన సాహిత్య అధ్యయనం అత్యంత కీలకం
- కలలోనూ మాతృభాషనే కలవరించే ప్రవాసుల స్ఫూర్తి ఆనందదాయకం
- దోహాలో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించిన పూర్వ ఉపరాష్ట్రపతి
దోహా (ఖతార్), మహా : సాహిత్యమే ఒకజాతి మనుగడకు లిఖితాధారం. ఒక దేశ వైభవాన్ని అక్కడి సాహిత్యం ప్రతిబింబిస్తుంది. భిన్నమైన విలువల అధ్యయనానికి కూడా సాహిత్యమే మూలాధారం. సాహిత్యమే చరిత్రకు సమగ్రమైన సాక్ష్యం అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆంధ్ర కళావేదిక – ఖతార్ ఆధ్వర్యంలో దోహాలో జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సును ప్రారంభించిన ఆయన, సాహిత్య-సాంస్కృతిక వైభవానికి భారతదేశమే నిలువెత్తు సాక్ష్యమని, అందులోనూ తెలుగుకు సుసంపన్నమైన సాహిత్యం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వంగూరి ఫౌండేషన్ వెబ్ సైట్ తో పాటు పలు ప్రచురణలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఖతార్ లో భారత రాయబారి విపుల్, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఆంధ్ర కళా వేదిక – ఖతార్ అధ్యక్షులు వెంకప్ప భాగవతార్, వంశీ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు సహా పలువురు తెలుగు సినీ, రాజకీయ, సాహిత్య ప్రముఖులు పాల్గొన్నారు.
తెలుగు సుసంపన్నమైన సాహిత్యం ఉందన్న ఆయన, ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక వచన సాహిత్యం వరకూ పరిణామానుక్రమంగా, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కిందన్నారు. ఈ సందర్భంగా గుణాఢ్యుడు మొదలుకుని నన్నెచోడుడు, కవిత్రయం, పోతన, అన్నమయ్య, వేమన వంటి తెలుగు సాహితీ వెలుగులను స్మరించిన ఆయన, అవధానం వంటి ప్రక్రియలు తెలుగు సాహిత్యానికి మరింత వన్నె తీసుకొచ్చాయన్నారు. సాహిత్యంలో మన చరిత్ర ఉందనే విషయాన్ని గుర్తించకపోవటం విచారకరమన్న ఆయన, మన సాహిత్యం గురించి తెలియని వారు రాసిన చరిత్ర సమగ్రమైనది కాదని పేర్కొన్నారు. అముక్తమాల్యద వంటి గ్రంథాల్లో సాహితీ విలువలతో పాటు చారిత్రక అంశాలు, మానవీయ విలువలు ఉన్నాయన్నారు. తెలుగు సాహితీ చరిత్రను క్షుణ్నంగా అధ్యయం చేస్తే, తెలుగు వారి చరిత్రను కూడా సమగ్రంగా తెలుసుకోవటం సాద్యమౌతుందని తెలిపారు.
భారతదేశ నిజమైన చరిత్రను ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్న వెంకయ్యనాయుడు, ఇందు కోసం అన్ని భాషల్లో ఉన్న భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఇందు కోసం అంతర్జాతీయంగా ఉన్న సంస్థలు చొరవ తీసుకోవాలని సూచించిన ఆయన, రెండు దశాబ్దాల క్రితం తెలుగు దూరదర్శన్ లో ప్రసారమైన రాజశేఖర చరిత్ర, కాంతం కథలు, వేయిపడగలు, అమరావతి కథలు వంటి ధారావాహికల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత అలాంటి ప్రయత్నాలు సమగ్రంగా జరగలేదన్న ఆయన, తెలుగు సాహిత్యాన్ని ఓటీటీ ద్వారా ఈ తరం యువతకు పరిచయం చేయాలని కళాకారులకు, సాహితీ సంస్థలకు సూచించారు. ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని అందరూ అస్వాదించే విధంగా, వారి పరిపక్వత స్థాయిని బట్టి ప్రతి ఒక్కరికీ చేరువ చేసే ప్రయత్నాలు సాగాలన్న ఆయన నూతన సాహిత్య సృష్టితో పాటు, మన చరిత్ర, సంస్కృతులకు నెలవైన ప్రాచీన సాహిత్యాన్ని అక్కున చేర్చుకోవాలని సూచించారు. అప్పుడే ముందు తరాలు నిజమైన చరిత్రను తెలుసుకుని, మనదైన సంస్కృతికి వారసులుగా, మనవైన విలువలతో జీవితాన్ని సాగిస్తాయని పేర్కొన్నారు.
మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన అస్తిత్వమన్న వెంకయ్యనాయుడు, మన సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే చక్కని వారధి మన భాషే అనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆకాంక్షించారు. భాషా పరిరక్షణ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలన్న ఆయన, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ళలో, తమ కుటుంబ సభ్యులతో మాతృభాషలోనే మాట్లాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా, మాతృభాషలో పరిణతి ఉండాలన్న ఆయన, ఇందు కోసం తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని, పిల్లలకు మన భాషలోని సాహిత్యాన్ని, మనదైన సంస్కృతిని పరిచయం చేసి, వారిని మనవైన మంచి విలువలతో తీర్చిదిద్దాలని సూచించారు. సృజనాత్మకతకు, మానవీయ విలువలకు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే విధంగా నూతన పంథాలో రచనలు రావలసిన అవసరం ఉందన్న ఆయన, సమాజంలో అక్కడక్కడ పేరుకుపోయిన జాఢ్యాలకు వ్యతిరేకంగా రచయితల కలం కదం తొక్కాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు.