హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అదానీ వ్యవహారంపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అదానీ సంస్థలతో రూ.12,400 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఘనంగా చెప్పారు. 5000 కోట్లు గ్రీన్ ఎనర్జీ, 5000 కోట్లు డేటా సెంటర్, సిమెంట్ పరిశ్రమ పెట్టుబడులు ఇలా మొత్తం రూ.12,400 కోట్ల పెట్టుబడులు చేసుకున్నామని చెప్పారు. తెలంగాణ డిస్కంలను అదానీకి అప్పగించేందుకు ఓల్డ్ సిటీ బిల్లుల వసూళ్ల డ్రామా మొదలుపెట్టారు. అదానీకి డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారు. యాదాద్రిలోని రామన్నపేటలో సిమెంట్ పరిశ్రమ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఏ మూసీ శుద్ధి అంటున్నారో అదే మూసీ సిమెంట్ ఫ్యాక్టరీ కారణంగా మురికి మాయం అవుతుందని చెప్పినా పట్టించుకోలేదు. ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్లుగా మమ అనిపించి అదానీకి సహకరించే పని చేశారు. పైన బడే భాయ్ ఆదేశించటంతో…కింద చోటా భాయ్ ఆచరించాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.