Mahaa Daily Exclusive

  రీల్స్ చేసి .. ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుని.. పుట్టిన రోజు వేడుకల్లో గన్ పేలి హైదరాబాద్ విద్యార్థి మృతి..

Share

  • అమెరికాలో తెలుగువిద్యార్ధి బలి

 

ఉప్పల్, మహా

ఖండాతరాలు దాటినా.. పెద్ద చదువుల కోసం దేశాలు దాటి వెళ్లినా.. ముందూవెనుకా ఆలోచించకుండా చేసే పనులు కుటుంబానికి షాక్ నిస్తున్నాయి. పుట్టిన రోజు వేడుకల పేరుతో ట్రెండింగ్ అంటూ చేస్తున్న వికృత చేష్టలు ప్రాణాలు బలికోరుతున్నాయి. బర్త్ డే – డెత్ డే గా మారుతుంటే కన్న పేగు విలవిలలాడుతుంది. రీల్స్.. రీల్స్.. రీల్స్.. సమయం, సందర్భం లేకుండా.. ఫాలోవర్స్ కోసం ఒళ్లు మరిచి చేసే పనులు కుటుంబీకులను కంటతడి పెట్టిస్తున్నాయి. మంచి చదువులు చదువుకుని, ఉద్యోగం తెచ్చుకుని తమని బాగా చూసుకుంటారు అనుకుంటున్న కన్న వారి కలలు.. కాటికి చేరుతున్నాయి. తమను మోయాల్సిన భుజాలను.. తమ భుజాలపై మోస్తుంటే ఆ భారాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు.. ఆ క్షోభను అనుభవిస్తున్నారు… ఉప్పల్ కు చెందిన సుదర్శన్‌రెడ్డి దంపతులు. పుట్టిన రోజు నాడు రీల్స్ చేసి .. ట్రెండ్ సెట్ చేద్దాం అనుకున్న ఓ తెలుగు విద్యార్ధికి. అదే అతని చివరి వీడియో అయింది. ఉప్పల్‌ ధర్మపురి కాలనీకి చెందిన సుదర్శన్‌రెడ్డి కుమారుడు ఆర్యన్‌రెడ్డి (23) ఏడాదిన్నర క్రితం మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. జార్జీయాలోని అట్లాంటాలో ఉంటున్నారు. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ.. ఎంఎస్ చదువుతున్నారు. ఈ నెల 13న అతని పుట్టిన రోజు. ఈనెల 13న ఆర్యన్‌రెడ్డి.. తన పుట్టినరోజును ఫ్రెండ్స్ తో కలిసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదే టైం లో గన్ తో కేక్ వెలిగించి.. రీల్స్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు అందరూ.. అయితే ఇక్కడే గన్ మిస్ ఫైర్ అయింది. బులెట్ ఆర్యన్ రెడ్డి శరీరంలోకి దూసుకెళ్లింది. తీవ్రరక్తస్రావం కావడంతో అతను అక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనపై అట్లాంటా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. గన్ వారికి ఎక్కడి నుంచి వచ్చింది..? ఎంత కాలం నుంచి గన్ వాడుతున్నారు అని విచారణ చేస్తున్నారు. ఆర్యన్ రెడ్డి మృతదేహం ఉప్పల్ కు చేరింది.