- ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస చర్యలు చేపట్టాలి
- అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల పైమంత్రి కొండా సురేఖ సుదీర్ఘ సమీక్ష
- పెరుగుతున్న పులుల సంఖ్య
- ఆహారం కొసం జింకల సంఖ్య పెంపునకు చర్యలు
- అటవీశాఖ చేపడుతున్న చర్యలపై మంత్రి సురేఖ హర్షం
హైదరాబాద్, మహా : అమ్రాబాద్ టైగర్ రిజర్వు, కవ్వాల్ టైగర్ రిజర్వుల పరిధిలో గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వాగాలతో ముడిపడి ఉన్నందున, ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని మంత్రి సురేఖ అటవీ అధికారులను ఆదేశించారు. ఉత్తర, దక్షిణ సరిహద్దులుగా విస్తరించిన టైగర్ రిజర్వులు తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను చేకూర్చాయని, వాటి ప్రత్యేకతను కాపాడేందుకు అటవీశాఖ నిరంతర చర్యలు చేపట్టాలని మంత్రి సురేఖ సూచించారు. ఈ రోజు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో మంత్రి, టైగర్ రిజర్వ్స్ గవర్నింగ్ బాడీస్ చైర్ పర్సన్ శ్రీమతి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుపల్లి భూపతి రెడ్డి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియాల్, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ రాంబాబు (అమ్రాబాద్ టైగర్ రిజర్వ్), సీఎఫ్, ఎఫ్ డీపీటీ శాంతారాం (కవ్వాల్ టైగర్ రిజర్వ్), డీఎఫ్ఓలు రోహిత్ (నాగర్ కర్నూల్), బాజీరావ్ పాటిల్ (ఆదిలాబాద్), రాజశేఖర్ (నల్గొండ), శివాశిష్(మంచిర్యాల్), ఎఫ్ డిఓ రామ్మూర్తి(మన్నన్నూర్), ఓఎస్డీ శంకరన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ ఉన్నతాధికారులు టైగర్ రిజర్వ్ ల గవర్నింగ్ బాడీస్, టైగర్ కన్సర్వేషన్ ఫౌండేషన్, గవర్నింగ్ బోర్డుల ఏర్పాటు, విధివిధానాలను మంత్రికి సమగ్రంగా వివరించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో చేపడుతున్న గ్రామాల తరలింపు ప్రక్రియ పై మంత్రి సురేఖ అధికారులను ఆరా తీశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో 26 కోర్ (కేంద్రీకృత) గ్రామాలుండగా, ప్రస్తుతం వాటిలో 4 గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు మంత్రి సురేఖ వివరించారు. పలు తెగలకు చెందిన ఆదివాసీలకు తమ ఆవాస ప్రాంతాలతో తరతరాలుగా అనుబంధం వుంటుందని, ఈ నేపథ్యంలో వారికి సంపూర్ణమైన నమ్మకాన్ని కల్పిస్తూ, వారి భద్రతకు భరోసానిస్తూ తరలింపు ప్రక్రియను చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అతిపెద్ద కోర్ ఏరియా కలిగిన రెండవ టైగర్ రిజర్వుగా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ నిలవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న పులుల ఆహారలభ్యతకు అనుగుణంగా జింకల సంఖ్యను పెంచే దిశగా చేపడుతున్న చర్యలను మంత్రి ప్రశంసించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని దాదాపు 20 శాతం ప్రాంతాన్ని పర్యాటక అవసరాలకు వినియోగించుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మన్నన్నూర్, మద్దిమడుగు, సోమశిల, దోమలపెంట ఎకో టూరిజం సర్క్యూట్లలో ప్రస్తుతం పర్యాటక సేవలు అందిస్తున్నట్లు అధికారులు మంత్రి సురేఖకు వివరించారు. కాటేజీలు, సఫారీ వాహనాలు, నేచర్ గైడ్ లు, వంటశాల మొదలైన సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. స్థానికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలుచేస్తున్నట్లు అధికారులు మంత్రి సురేఖకు వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటి అండ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో స్థానిక యువతకు శిక్షణనిచ్చి, వారి ఆధ్వర్యంలో వంటశాలను నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలుచేస్తున్న కార్యక్రమాలతో పాటు పట్టుపురుగుల పెంపకం పై స్థానికులకు శిక్షణను కల్పించి, ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు.
సోమశిల, అమరగిరి ఎకో టూరిజం సర్క్యూట్, దోమలపెంట-శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లను రాబోయే రోజుల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రి సురేఖకు అధికారులు తెలిపారు. దోమలపెంట-శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్ లో భాగంగా ఎంతో ప్రాశస్త్యమైన అక్కమహాదేవి గుహలకు తెలంగాణ ప్రభుత్వపరంగా భూ, జలమార్గాల్లో భక్తులకు యాత్రా సౌకర్యం కల్పించేందుకు గాను అవకాశాలను పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నల్లమల అటవీప్రాంతంలో వున్న తెలంగాణ అమర్ నాథ్ గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్ లో చేపట్టనున్న సర్క్యూట్ లలో చేర్చి, ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కల్పించేదిశగా కార్యాచరణను అమలుచేయాలని అధికారులను మంత్రి నిర్దేశించారు.
పరిహారం రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంపుపై చర్చ
వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఇస్తున్న విషయాన్ని మంత్రి సురేఖ గుర్తు చేశారు. ‘స్టేట్ లెవల్ కమిటి ఫర్ మిటిగేటింగ్ హ్యూమన్ యానిమల్ కాంఫ్లిక్ట్’ పూర్తిస్థాయి చర్చల తర్వాత ఈ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.