- ఇప్పటికే సంప్రదింపులు పూర్తి.. సానుకూలంగా సీఎం రేవంత్
- గ్రేటర్ నుండి నలుగురు.. జిల్లాల నుండి మరో ఇద్దరు
- ఈ వారంలోనే చేరే అవకాశం ఉందంటున్న నేతలు
- విస్తరణకు ముందే చేరాలని పలువురు ఎమ్మెల్యేల ఉబలాటం
- బిఆర్ఎస్ కు.. మరో షాక్ తప్పదా?
హైదరాబాద్, మహా
బిఆర్ఎస్ పార్టీకి మరో గండం పొంచి ఉంది. హైకోర్టు సంచలన తీర్పు నేపథ్యంలో.. మరికొంతమంది ఎమ్మెల్యేలు అధికార ఫలాలు అందుకునేందుకు, తమ నియోజకవర్గ ప్రజలకు అందించేందుకు చేయందుకోవాలని డిసైడ్ అయ్యారు. హైకోర్టు తీర్పు రాగానే.. కీలకనేతలతో టచ్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కారు దిగి చేయందుకోగా, హైకోర్టు తీర్పుతమకే అనుకూలంగా వస్తుందంటూ ఎమ్మెల్యేలకు నచ్చజెప్పి మరింతమంది పార్టీ మారకుండా ఇంతకాలం బిఆర్ఎస్ అధినేత చేయగలిగారు. ఉప ఎన్నికలు ఖాయమంటూ నమ్మించి.. నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించమంటూ కొందరు నేతలను కూడా వలస నియోజకవర్గాల్లో ప్రోత్సహించారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ కావడం, ఎప్పటికైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలే తప్ప.. స్పీకర్ విధుల్లోఇతరులు జోక్యం చేసుకోలేరని స్పష్టత రావడంతో ఎవరిదారి వారు చూసుకోవాలని నేతలు భావిస్తున్నారు. ఏడాదికాలంగా వెయిట్ చేసి నష్టపోయిన నేతలు ఇపుడు ఎంతమాత్రం టైం వేస్ట్ చేసుకోకూడదని భావిస్తున్నారు.
గ్రేటర్ లో భారీ దెబ్బే?
గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లోక్ సభ ఎన్నికలకు మందే కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తర్వాత శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, పటాన్ చెరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎల్బీనగర్, ఉప్పల్ , అంబర్ పేట ఎమ్మెల్యేలు పార్టీ మారవచ్చన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంగతి సరేసరి. గ్రేటర్ హైదరాబాద్ లో బిఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా, బైపోల్ లో కంటోన్మెంట్ స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకుంది. బిఆర్ఎస్ నుండి నలుగురు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇపుడు మరో ఆరుగురు సిద్దంగా ఉన్నారని, ప్రస్తుతానికి నలుగురికి మాత్రమేగ్రీన్ సిగ్నల్ లభించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. జిల్లాల నుండి మరో ఇద్దరు టచ్ లో ఉన్నారని, ఇందులో మాజీ సీఎం జిల్లా నుండి ఒకరు.. ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ఒకరు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 29న బిఆర్ఎస్ దీక్షా దివాస్ నిర్వహిస్తుండగా, ఈనెల 30న ఢిల్లీ కి వెళ్ళే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరుగా చేరుతారా.. ఆరుగురు ఒకేసారి చేరుతారా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.
విస్తరణకు ముందే?
మంత్రివర్గ విస్తరణకు ముందే చేరాలని, వలస ఎమ్మెల్యేల్లో ఇద్దరికి బెర్త్ లు ఇవ్వాలని కొందరు నేతలు సంప్రదింపులు చేస్తున్నట్లు కాంగ్రెస్ సర్కిల్స్ లో వినబడుతోంది. ఇంకా డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ వంటి పదవులు భర్తీ చేయకపోగా, వలస ఎమ్మెల్యేల్లో కొందరు డెవలప్ మెంట్ ను, మరికొందరు పదోన్నతిని ఆశిస్తున్నారు. డిసెంబర్ 7లోగా గులాబీపార్టీలో సంచలనాలు ఖాయమన్న చర్చమాత్రం సాగుతోంది. ఇప్పటికే పిసిసి చీఫ్ కూడా.. కేటీఆర్ చుట్టూ ఉండే ఇద్దరు ముగ్గురు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రకటించారు.
…….