- వేగవంతమైన జీహెచ్ఎంసీ విస్తరణ
- 51 గ్రామాల విలీనం
- శివారు భూములకూ డిమాండ్
- విలీన గ్రామాలలో మౌలిక వసతులపై నజర్
- హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామాల ప్రజలు
హైదరాబాద్, మహా : గ్రేటర్ హైదరాబాద్ పరిదిని విస్తరించిన మహానగరంగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ శివారులో ఉన్న పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని ఇప్పటికే సర్కార్ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్‌ను ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించే క్రమంలో రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకోగా తొలిదశలో శివారు మున్సిపాలిటీల్లో 51 గ్రామాలను కలిపేందుకు 2 నెలల క్రితమే ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారి చేసింది. ఈ ఆర్డినెన్స్‌కు అనుగుణంగా మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రేటర్ శివారులోని మున్సిపాలిటీల్లోకి అక్కడున్న సమీప గ్రామపంచాయతీల విలీన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విలీన ప్రక్రియలో భాగంగా గ్రామ పంచాయతీల రికార్డులు, భూములను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇళ్లు, ప్రభుత్వ ఆస్తులను మున్సిపాలిటీల్లోని వార్డుల ఖాతాల్లోకి చేర్చుతున్నారు. ప్రాపర్టీ ట్యాక్సులు వసూలు చేస్తున్నా ఆయా గ్రామ పంచాయతీల పేర్లను సాఫ్ట్‌వేర్‌లో ఎక్కించకపోవటంతో ఆన్‌లైన్ ద్వారా ట్యాక్స్ చెల్లించటం సాధ్యం కావట్లేదు. అయితే ఇప్పుడు మున్సిపాలిటీల్లో విలీనమవుతుండటంతో వ్యవస్థ పూర్తిగా మారనుంది. ఇక ఇప్పటి వరకు గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న వారంతా మున్సిపాలిటీ వ్యవస్థలోకి వెళ్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆయా గ్రామాల్లో ఉన్న భూములకు ఇన్ని రోజులూ అంతంతమాత్రంగానే ధరలు పలుకగా ఇప్పుడు మున్సిపాలిటీలో కలుపుతుండటంతో జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుండటంతో అక్కడి భూములకు మంచి డిమాండ్ రానుంది. దీంతో ఆ భూముల ధరలరు రెక్కలు రానున్నాయి. ఈ క్రమంలో అక్కడి ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
ఉద్యోగులు కూడా పురపాలక శాఖ పరిధిలోకి
ఇప్పటివరకు గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులుగా విధులు నిర్వహించిన ఉద్యోగులు.. నేరుగా పురపాలక శాఖ అధికారులుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఇప్పటివరకు వారు విధులు నిర్వహించిన సంవత్సరాలను సర్వీసుగా పరిగణించనున్నార. గ్రామ పంచాయతీల్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహించిన వారిని కూడా మున్సిపాలిటీ అధికారులు తీసుకున్నా… వార్డుల్లో పని విధానం, ఇతర కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగం ఇస్తున్నారు. సర్వే లెక్కలు, గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ గ్రామాల్లో పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. వీరందరికీ పురపాలక శాఖ నుంచే జీతాలు వచ్చేలా చర్యలు చేపట్టారు. మున్సిపాలిటీల పరిధి పెరగటంతో పంచాయతీల్లో పని చేస్తున్న వారికి ఉద్యోగాలు ఇస్తుండటంతో పాటు కొత్తగా మరికొంతమందిని నియమించుకోవాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులకు విన్నపాలు వస్తున్నాయి. మరోవైపు మున్సిపాలిటీల్లో విలీనమవుతున్న 51 గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై కూడా మున్సిపల్ కమిషనర్లు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి బెడద ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో సరఫరా చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో ఉన్న మురుగునీటి వ్యవస్థపై కూడా అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామ పంచాయతీలు ఇవే…. మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు రాయిలాపూర్, పూడూరు, నాగారం మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు రాంపల్లి, దయరా, కరీంగూడ, గోధుమకుంట, బోగారం
తూంకుంట మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు శామీర్‌పేట, బొమ్మరాశిపేట, బాబాగూడ
దమ్మాయిగూడ మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు కీసర, చీర్యాల్, యాద్గార్‌పల్లి, తిమ్మాయిపల్లి, అంకిరెడ్డిపల్లి, నర్సంపల్లి, పోచారం మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు కాచవాని సింగారం, ప్రతాప్ సింగారం, చౌదరిగూడ, కొర్రముల, వెంకటాపూర్, ఘట్‌కేసర్ మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు ఘనపూర్, ఏదులాబాద్, అంకుశాపూర్, అవుషాపూర్, మర్రిపల్లిగూడ, గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలు మునీరాబాద్, గౌడవెల్లి గ్రామాలున్నాయి. ఇకపోతే సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మునిసిపాలిటీలో కిష్టారెడ్డిపేట, ఐలాపూర్ తండా, ఐలాపూర్, దయరా, సుల్తాన్‌పూర్, పటేల్ గూడ, తెల్లాపూర్ మునిసిపాలిటీలో విలీనమయ్యే గ్రామాలు పోచారం, ముత్తంగి, ఘనాపూర్, కర్దానూర్, పాట గ్రామాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్‌పేట మునిసిపాలిటీలో విలీనమయ్యే గ్రామాలు తారామతిపేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, బాచారం నార్సింగి మునిసిపాలిటీలో మీర్జాగూడ, తుక్కుగూడ మునిసిపాలిటీలో హర్షగూడ గ్రామాలుండగా, శంషాబాద్ మునిసిపాలిటీలో చిన్న గోల్కొండ, పెద్ద గోల్కోండ, రషీద్‌గూడ,, బహదూర్ గూడ, ఘాంసీమియా గూడ, హమీదుల్లానగర్ గ్రామాలున్నాయి.