Mahaa Daily Exclusive

  ఎంపీతోపాటు 400 మందిపై కేసులు నమోదు..

Share

మహా: యూపీలోని సంభాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. స్థానికంగా ఉన్న స్కూళ్లను మూసివేశారు. ఇంటర్నేట్ సేవలను కూడా నిలిపివేశారు. జనాలు గుంపులుగుంపులుగా గుమిగూడటంపై పోలీసులు నిషేధం విధించారు. స్థానిక నియోజకవర్గానికి చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జియావుర్ రెహమాన్, స్థానిక ఎమ్మెల్యే కుమారుడితోపాటు 400 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, సంభాల్ పట్టణంలోని మొగల్ కాలనీకి చెందిన షాహీ జామా మసీదు ఉన్న చోట గతంలో హరిహర మందిరం ఉండేదన్న ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన న్యాయస్థానం సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఆదివారం అధికారులు సర్వే అక్కడకు వెళ్లి నిర్వహించసాగారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చి సర్వే చేయొద్దంటూ మసీదు ముందు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సర్వేను అడ్డుకున్నారు. పోలీసులకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టి, వారిపై రాళ్లు రువ్వారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు భారీగా మోహరించి లాఠీ చార్జ్ చేశారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. ఈ అల్లర్ల కారణంగా నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులు కూడా ఉన్నారు. ఈ ఘటన విషయమై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే… బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.