మహా: మహారాష్ట్రలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణనను కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. తదుపరి సీఎం పదవీ బాధ్యతలు చేపట్టే వరకు ఏక్ నాథ్ షిండే ఆపధర్మ సీఎంగా కొనసాగనున్నారు. అయితే, ఏక్ నాథ్ షిండే తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా మరోసారి మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరూ? ఫడ్నవీసేనా? అని చర్చిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే ఆధ్వర్యంలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అధిక సీట్లతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. గత పార్లమెంటు ఎన్నికల్లో కొంత నిరాశ కనబడినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఊహించని విధంగా అత్యధిక స్థానాలు గెలిచారు. 233 సీట్లు గెలిచి ప్రతిపక్ష పార్టీలను మట్టి కురిపించాయి. ఈ ఫలితాలపై పలువురు మహాయుతి గెలుపునకు కారణం రెండు విషయాలను ప్రధానంగా చెబుతున్నారు. అవేమంటే.. మొదటిది ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించారని, హామీలను కూడా ప్రజలకు మేలు చేసే విధంగా పలు సంచలన హామీలు ఇచ్చారని చెబుతున్నారు. రైతులకు మేలు చేసే విధంగా పథకాలను అమలు చేస్తామని, సామాన్య జనానికి ఉపయోగపడే విధంగా పథకాలను అమలు చేస్తామంటూ హామీ ఇవ్వడంతోనే ఈ విజయం సాధ్యమైందని చెబుతున్నారు. మరో విషయమేమంటే.. మహాయుతి కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, అజిత్ పవార్ ఎన్సీపీ, ఏక్ నాథ్ షిండే శివసేన పార్టీలు ఒక్కధాటిపై తమ కూటమిని గెలిపించుకోగలిగారని చెబుతున్నారు. గతంలో జరిగిన లోపాలను సవరించుకుని ఈ ఎన్నికల్లో ప్రజలకు హామీలు ఇచ్చారని, మొత్తంగా మహారాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారనో అనేది వారు అంచనా వేయగలిగారని.. అందుకే మహాయుతి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరో అంశంపై ప్రస్తుతం భారీగా చర్చ నడుస్తుంది. ఎన్నికల ఫలితాలు విడుదలై మహాయుతి గెలిచిందని తెలియగానే, తదుపరి సీఎం ఎవరు అనేదానిపై చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. సంబరాలు చేసుకున్న మహాయుతి కూటమి పార్టీలు కూడా ఇదే విషయాన్ని అంచనా వేసుకున్నాయి. ఆ పార్టీ నేతలు కూడా ఒకరికొకరు చర్చలు జరుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు కూడా ఇదే విషయమై చర్చిస్తున్నారు. ప్రస్తుతమున్న ఏక్ నాథ్ షిండేను రెండోసారి సీఎంగా కొనసాగిస్తారా? లేక ఫడ్నవీస్ కు మరోసారి అవకాశం కల్పిస్తారా? లేదా ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ కు అవకాశం కల్పిస్తారా? అని అంతా చర్చిస్తున్నారు. అంతేకాదు.. ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశం కల్పిస్తారు.. ఎవరికి అవకాశం కల్పించినా మిగతా ఇద్దరు ఇలాగే కలిసి ఉంటారా..? లేదా భవిష్యత్తులో ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తారా? అనే అంశంపై చర్చలు కూడా చేస్తున్నారు. బీజేపీ మాత్రం చాలా వ్యాహాత్మకంగా అడుగులు వేస్తోందంటా. మహారాష్ట్రపై ఏ మాత్రం పట్టు సడలకుండా ఉండేందుకు నిర్ణయం తీసుకోవాలని జాతీయ నేతలు, మహారాష్ట్ర నేతలతో చర్చల మీద చర్చలు జరుపుతుందని చెబుతున్నారు. అందులో భాగంగా సీఎం ఏక్ నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్ లను బీజేపీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో సీఎంను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ కు మరోసారి అవకాశం కల్పించారని చెబుతున్నారు. అందులో భాగంగానే నేడు సీఎం ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని చెబుతున్నారు. బీజేపీ ఎత్తులకు పై ఎత్తు వేస్తుంది కాబట్టి ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు కూడా అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు చెబుతున్నారు. అజిత్ కు అవకాశం కల్పిస్తే కూటమిలో సమ ప్రాధాన్యత కల్పించినట్లు అవుతుందని, దీంతో కూటమి భవిష్యత్ లో విడిపోకుండా ముందుకు వెళ్తుందనే భావనలో కూడా బీజేపీ ఉండొచ్చని అంటున్నారు. ఎన్నికల్లో పెద్ద పాత్రను పోషించి తన పంథాను నెగ్గించుకున్న బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలి మరి ఎవరు మహాకు సీఎం అవుతారనేది.