- న్యూయార్క్ టోక్యో లాగా తీర్చిదిద్దుతాం
- రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం
- రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకు మణిహారం
- రూ.35వేల కోట్లతో నిర్మించి తీరుతాం
- మా ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టెట్ లో 29శాతం వృద్ధి
- హైదరాబాద్‌కు కిషన్ రెడ్డి ఏం తెచ్చారు?
- ఆయన మూసీలో పడి ఆత్మహత్య చేసుకున్నా ఎవరూ పట్టించుకోరు
- బీజేపీ, బీఆర్ఎస్ నగర అభివృద్ధిపై మీ విధానం ఏంటో చెప్పండి
- రైజింగ్ హైదరాబాద్ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- 7వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం
హైదరాబాద్, మహా
గ్రేటర్ హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యూయార్క్, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేవిధంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లుగా రేవంత్ రెడ్డి వివరించారు. ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్లో నిర్వహించిన రైజింగ్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ప్రజా పాలన కోసం ఏడాది క్రితం ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని గుర్తు చేశారు. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది కాంగ్రెస్సేనన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్, రంగారెడ్డి నుంచే వస్తుందని పేర్కొన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు మణిహారం
రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణకే మణిహారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను నిర్మించబోతున్నామని వివరించారు. ఓఆర్ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. 40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం అని ఆయన పునరుద్ఘాటించారు. టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడేలా నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్ అద్భుత నగరం అవుతుందని రేవంత్ వివరించారు.
అబద్దాలతో సెల్ఫ్ డబ్బా
గత ముఖ్యమంత్రి అబద్ధాలతో గడిపేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేశామన్నారన్న సీఎం రేవంత్ హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాలుష్యం పెరిగి ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలు నివసించేందుకు వీలు లేకుండా మారాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే విధంగా వాటర్ హార్వెస్టింగ్ బావులను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో రియల్ఎస్టేట్ వ్యాపారం 29 శాతం పెరిగిందన్నారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చుతోందని రేవంత్ తెలిపారు. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు.
కిషన్ రెడ్డి నిధులు తీసుకురా
హైదరాబాద్ నగర అభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ దొందుదొందుగానే తయారయ్యాని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనకు హుస్సేన్ సాగర్ లోని నీళ్లు అద్దంపడుతున్నాయని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీజేపీ కిషన్ రెడ్డి మోడీని ఒప్పించి లక్షన్నర కోట్ల నిధులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో శాశ్వత ప్రతిపాదికన మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం పనులు చేయాలంటే లక్షన్నర కోట్లు అవసరం అవుతాయన్న రేవంత్ రెడ్డి ఆ నిధులను తీసుకొస్తే 10 లక్షల మంది సమక్షంలో మోదీని, కిషన్ రెడ్డిని సన్మానిస్తామని ప్రకటించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై బీజేపీ తమ విధానాన్ని చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వంపై కక్ష్య ఉంటే వేరే రకంగ చూసుకోవాలని, హైదరాబాద్ ను అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
హైదరాబాద్ నగర అభివృద్ధిపై మంత్రివర్గ ఉపసంఘం
బీజేపీ, బీఆర్ఎస్ నగర అభివృద్ధిపై తమ విధానాలను వెల్లడించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో ఉప సంఘం ఉంటుందని, అఖిల పక్షంతో కలిసి వచ్చి నగర అభివృద్ధిపై పాలసీ డాక్యుమెంట్ ను తెలంగాణ సమాజానికి చూపించాలని సీఎం కోరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
……………..