కేరళ రాజ్‌భవన్‌లో శాకాహార వివాదం.
* బాధ్యతలు చేపట్టిన తొలి రోజే గవర్నర్ సంచలన నిర్ణయం!
* వ్యక్తిగత రుచులా లేక కాషాయ అజెండా అమలుకు తొలి అడుగుా.
* కేరళలో రగులుతున్న ఆహార రాజకీయం!
తిరువనంతపురం,మహా.
కేరళలో రాజ్‌భవన్ వంటగది వేదికగా నూతన రాజకీయ తుపాను చెలరేగింది. రాష్ట్ర 29వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఓం ప్రకాష్ మాథూర్ తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. లోక్‌భవన్ (రాజ్‌భవన్) అధికారిక వంటగదిని పూర్తిగా శాకాహార మయంగా మలచాలంటూ ఆయన జారీ చేసిన ఆదేశాలు రాష్ట్రంలో తీవ్ర అగ్గి రాజేశాయి. కేరళ సాంప్రదాయాలు, అక్కడి ప్రజల విభిన్న ఆహారపు అలవాట్లకు ఇది పూర్తిగా విరుద్ధమంటూ అధికార, విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతుండటంతో ఈ పరిణామం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్ర కొత్త గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే ఓం ప్రకాష్ మాథూర్ ఈ వివాదాస్పద ఆదేశాలు జారీ చేశారు. లోక్‌భవన్ అధికారిక వంటగదిలో ఇకపై ఎలాంటి మాంసాహార వంటకాలు తయారు చేయకూడదని, వడ్డించకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. తాను కరడుగట్టిన శాకాహారినని, వ్యక్తిగత కారణాల వల్లే ఈ మార్పులు కోరినట్లు గవర్నర్ కార్యాలయ వర్గాలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాయి. లోక్‌భవన్ సిబ్బంది ఎవరి ఆహారపు అలవాట్లను తాము నియంత్రించడం లేదని, ఎవరికి నచ్చింది వారు తినొచ్చని స్పష్టం చేసినప్పటికీ, ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం మాత్రం శాంతించలేదు.
గవర్నర్ నిర్ణయం వెనుక ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ రాజకీయ కుట్ర దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కేరళ ఒక తీర ప్రాంత రాష్ట్రమని, ఇక్కడ ప్రజలది విభిన్నమైన ఆహార సంస్కృతి అని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ప్రజల ఇష్టాలను శాసించే హక్కు ఎవరికీ లేదని, ఇది ప్రాథమిక హక్కులను హరించడమేనని మండిపడ్డారు. ఇది కేరళలో కాషాయ అజెండాను బలవంతంగా అమలు చేయడానికి వేస్తున్న తొలి అడుగు అని ఆయన ఆరోపించారు. మరోవైపు, ఏది తినాలనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఇతరుల ఆహారంపై ఆంక్షలు విధించడం తప్పు అని కేరళ నేత రమేష్ చెన్నితాలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ పార్టీలు సైతం ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత్‌లో శాకాహారం లేదా మాంసాహారాన్ని ఎంచుకునే ప్రజాస్వామ్య హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ గుర్తుచేశారు. ఈ హక్కులను కాలరాసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆహారాన్ని కూడా మతపరమైన ఆయుధంగా మారుస్తున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు.
ఈ తీవ్ర విమర్శల నేపథ్యంలో లోక్‌భవన్ వర్గాలు స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాయి. గవర్నర్‌కు వంట చేసే వంటగదిలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, అక్కడ గవర్నర్‌తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిలో కొద్దిమంది మాత్రమే భోజనం చేస్తారని తెలిపాయి. మిగతా ఉద్యోగులు ఎవరికి నచ్చిన ఆహారాన్ని వారు తెచ్చుకోవచ్చని, ఇతరులపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. గతంలో కొంతమంది గవర్నర్ల హయాంలో లోక్‌భవన్‌లో మాంసాహార వంటకాలు తయారైనప్పటికీ, కొత్త గవర్నర్ వ్యక్తిగత నిబంధనల కారణంగా ఈ మార్పు జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, కేరళ వంటి భిన్న సంస్కృతుల రాష్ట్రంలో రాజ్‌భవన్ నుంచి వచ్చిన ఈ తొలి సంకేతం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ ఘర్షణలకు దారితీస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.







