Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌…

Share

స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌.
* వైసీపీ పిటిషన్‌ కొట్టివేత
* ఇక ఎన్నికల్లో పోటీ చేయాలి.
* ఆల్ ది బెస్ట్ అంటూ సీజేఐ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మహా.
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల సమర్పణ గడువు వివాదంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పుతో తోసిపుచ్చింది. నామినేషన్లు వేసేందుకు అదనపు సమయం కేటాయించాలని కోరిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థనను ధర్మాసనం పూర్తిగా నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపి తుది ఉత్తర్వులు వెలువరించింది. గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన అన్ని మార్గదర్శకాలకు అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కోర్టుకు స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతో దాఖలైన ఈ పిటిషన్‌లో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేస్తూ, నామినేషన్ల సమయం ముగిసినందున ఇక ఎన్నికలకు వెళ్లాలని, అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అని పేర్కొంటూ స్థానిక పోరు నిర్వహణకు పచ్చజెండా ఊపింది.
ఎన్నికలను సంపూర్ణంగా పారదర్శకంగా, నిష్పాక్షిక వాతావరణంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అత్యున్నత న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ప్రక్రియతో పాటు పరిపాలనా పరమైన అంశాలన్నింటినీ సీసీటీవీ కెమెరాల ద్వారా సమగ్రంగా పర్యవేక్షించాలని సూచించింది. ఒకవేళ ఏవైనా దౌర్జన్యాలు లేదా బెదిరింపుల కారణంగా నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే, వారు తగిన సాక్ష్యాధారాలతో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించింది. ఈ అంశాలపై తదుపరి విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.