జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసేవరకు పోరాటం ఆగదు.
* సర్ ద్వారా ఓట్ల తొలగింపుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం.
న్యూఢిల్లీ, మహా.
ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం లేదా ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను పదవి నుంచి తొలగించే వరకు ‘సర్’ విధానానికి వ్యతిరేకంగా విపక్షాలు తమ నిరసనలను ఆపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజధాని దిల్లీలోని త్రిలోక్‌పురి ప్రాంతంలో నిర్వహించిన ‘జన్ సున్వాయి’ (ప్రజా బహిరంగ విచారణ) కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘సర్’ (ప్రత్యేక సమగ్ర సవరణ) కింద కేవలం ఈ ఒక్క ప్రాంతంలోనే నాలుగు బూత్‌లకు చెందిన 416 మంది ఓటర్ల పేర్లను అత్యంత అక్రమంగా తొలగించారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ అక్రమాలపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను నిలదీస్తే, ఆయన సమాధానం ఇవ్వడానికి వెనుకంజ వేస్తూ దాక్కుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల సంఘం తీరుపై విపక్షాలు చేస్తున్న పోరాటం భవిష్యత్తులోనూ మరింత ఉద్ధృతంగా కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తమ ప్రాథమిక హక్కైన ఓటు హక్కును కోల్పోతున్నారని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయిలో ఓట్ల చోరీకి కుట్ర జరుగుతోందని, పద్ధతి ప్రకారం పేద ప్రజల పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించిన ఆయన, ఎంపిక చేసిన కొద్దిమంది బిలియనీర్ల ప్రయోజనాల కోసం ఒక నవ భారతాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. అటువంటి వ్యవస్థలో పౌరులకు ఎలాంటి రాజ్యాంగ హక్కులు ఉండవని, పేద ప్రజల హక్కులను పూర్తిగా నిరాకరించే కుట్ర నడుస్తోందని ధ్వజమెత్తారు. కేవలం బిలియనీర్ల ప్రయోజనాల కోసమే దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఎన్నికల ప్రక్రియలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బట్లపై నిర్వహించిన ఈ బహిరంగ విచారణ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు సిపిఐ (ఎంఎల్) నేత దీపాంకర్ భట్టాచార్య, స్వరాజ్ ఇండియా ప్రముఖ నేత యోగీంద్ర యాదవ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధితులు తమ ఓట్లు తొలగించబడిన వైనాన్ని నేతల ఎదుట ఆవేదనతో వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తిగా లోపభూయిష్టంగా సాగుతోందని, దీనిపై ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు.







