Mahaa Daily Exclusive

  ఎస్‌ఐఆర్‌ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా..

Share

ఎస్‌ఐఆర్‌ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా
* ఎన్నికల సంఘం అఫిడవిట్‌పై స్పందించేందుకు పిటిషనర్ల విజ్ఞప్తి.
* సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు.
న్యూఢిల్లీ, మహా.
ఎన్నికల సంఘంలో (ఈసీఐ) ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ సందర్భంగా తలెత్తిన విభేదాలు, ఫామ్‌-6లో మార్పుల అంశంపై విపక్షాలు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చివరి నిమిషంలో సమర్పించిన అఫిడవిట్ అత్యంత కీలకంగా మారింది. గతంలో మీడియాలో వచ్చిన కథనాలను కొట్టిపారేసిన ఈసీ, కమిషనర్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. అయితే, రాత్రికి రాత్రి అఫిడవిట్ దాఖలు కావడంతో దాన్ని పరిశీలించి తమ స్పందన తెలియజేసేందుకు సమయం కావాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరడంతో, సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.
12 విపక్ష పార్టీలతో పాటు న్యాయవాది రాకేష్ సింగ్ దాఖలు చేసిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు సిద్ధమైంది. అయితే విచారణకు ముందు రాత్రే ఎన్నికల సంఘం హడావిడిగా సుప్రీంకోర్టులో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్‌ఐఆర్‌కు సంబంధించి తాము తీసుకున్న నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు, ఇతర ఎన్నికల కమిషనర్లకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆ అఫిడవిట్‌లో ఈసీ తేల్చిచెప్పింది. కమిషనర్లు లేవనెత్తిన అంశాలను అధికారిక అభ్యంతరాలుగా పరిగణించలేమని, వాటిని ఎక్కడా బయటపెట్టలేదని పేర్కొంటూ వివాదాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అలాగే ఎన్నికల కమిషనర్లు, సీఈసీ విడివిడిగా సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా, ఈసీఐ తరఫున ఒకే లాయర్‌ అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం. ఇక ఫామ్‌-6 విషయంలోనూ తాము ఎలాంటి చట్టపరమైన మార్పులు చేయలేదని, కేవలం ఒక డిక్లరేషన్‌ను విడిగా జతచేసామని ఈసీ వివరించింది.
అయితే, విచారణ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఈసీ అఫిడవిట్ దాఖలు చేయడంతో, అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని పిటిషనర్ రాకేష్ సింగ్ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఈసీ వివరణను తక్షణమే పరిగణలోకి తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో విచారణను మరో తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ నాటికి పిటిషనర్లు అందరూ ఈసీ అఫిడవిట్‌పై తమ అభ్యంతరాలు, స్పందనలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కీలక కేసుకు సంబంధించి ఇవాళ వెలువడాల్సిన నిర్ణయం తదుపరి వాయిదా తేదీకి వాయిదా పడింది.